సాగుకు పెట్టుబడి కోసం రైతు ఏ షావుకారు ముందు చేయి చాచకూడదు. అన్నం పెట్టే చేయి శాసించే స్థితిలో ఉండాలి కానీ యాచించే స్థితిలో ఉండకూడదన్నది సీఎం కేసీఆర్ ఆకాంక్ష. అందుకోసమే ఏడాదికి రెండుసార్లు వానకాలం, యాసంగి పంటలకు కలిపి ఎకరానికి రూ.10వేలు రైతుబంధు సాయాన్ని అందజేస్తున్నారు. ఇప్పటి వరకు పది విడుతలు పూర్తికాగా, పదకొండవ విడుత రైతుబంధు సాయం పంపిణీ కొనసాగుతున్నది. రైతుబంధు పథకం వచ్చిన తర్వాత వ్యవసాయంలో విప్లవాత్మక మార్పు వచ్చింది. రైతుబంధుతో రైతుల్లో భరోసా పెరిగి ధైర్యంగా వ్యవసాయం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో బుధవారం వరకు 2,74,247 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.196.7కోట్లు జమ అయ్యాయి.
భీమ్‌గల్, జూలై 5: ఎవుసం పనులు మొదలు పెట్టే సమయానికి డబ్బులు ఇచ్చే పథకం ఏ రాష్ట్రంలో చూడలేదు. వినలేదు. వ్యవసాయం దండగా అన్న వారే వ్యవసాయం పండుగ అనేలా చేసిన ఏకైక సీఎం కేసీఆర్. ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా మా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేయడం సంతోషంగా ఉన్నది. ఏదైనా ప్రభుత్వ పథకాలు పొందాలంటే ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ దుస్థితి లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పాలిట వరం.
– పుప్పాల మల్లేశ్, రైతు, బాచన్పల్లి
మోర్తాడ్, జూలై 5: వానలు చాలయినయంటే బాకీల కోసం తిరిగెటోళ్లం. విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చు కోసం. కానీ తెలంగాణ వచ్చినంక కేసీఆర్ సార్ రైతుబంధు ఇస్తున్ననుంచి వాటి కోసమే ఎదురుజూస్తున్నం. రైతుబంధు వచ్చిందంటే మనసుకు ఎంతో సంతోషమేస్తది. నీళ్లబాధలు లేవు. కరంటు బాధలు లేవు. ఖర్చుల బాధలు తప్పినయి. ఇట్లుంటే ఎవరైనా సంతోషపడ్తరు. మాకు రెండెకరాల భూమి ఉన్నది. ఏడాదికి రైతుబంధు రూపంలో రూ.20వేలు వస్తయి. నా భర్త, నేను వ్యవసాయం చేసి బతుకుతున్నం. ఇంతకుముందు ఉన్న కష్టాలు లేకపోవడంతో సంతోషంగా ఉంటున్నం.
-కాస రాజకళ, రైతు, దోన్పాల్
మాక్లూర్, జూలై 5: ఒకప్పుడు పంట వేయాలంటే అప్పు ఎక్కడ దొరుకుతుందా అని చూసేవాళ్లం. ఇప్పుడా పరిస్థితి లేదు. రైతుబంధు వస్తదనే ధీమా ఉన్నది. సీఎం కేసీఆర్ సారు మనసున్న మారాజు. రైతుబంధు ద్వారా వచ్చిన పైసల్తోని వరి నాట్లు వేసిన కూలీలకు, ఎరువులకు ఇబ్బంది లేకుండా అయ్యింది. రైతుబంధు పథకం పెట్టిన నాటి నుంచి మాకు ఢోకాలేదు. మా కోసం ఇంత చేస్తున్న కేసీఆర్ సారును మరువం.
– ఎన్. పోశెట్టి, రైతు,ధర్మోర
బీబీపేట్, జూలై 5: ప్రభుత్వం అందిస్తున్న పంట పెట్టుబడి సాయం డబ్బులు నా ఖాతాలో జమ అయ్యాయి. ఈ డబ్బులతో విత్తనాలు కొనుగోలు చేస్తా. సీఎం కేసీఆర్ చెప్పినట్లే రైతుబంధు డబ్బులు వేయడం ఆనందంగా ఉన్నది. ఈసారి కాస్త ముందుగానే డబ్బులొచ్చాయి. ఉచిత విద్యుత్, సాగునీరు, రైతుబంధు, రైతుబీమాలాంటి ఎన్నో పథకాలు అమలుచేస్తూ తెలంగాణ ప్రభుత్వం రైతులను ఆదుకుంటున్నది.
– చింతకుంట మోహన్‌రెడ్డి, రైతు, మాందాపూర్
నిజాంసాగర్, జూలై 5: సీఎం కేసీఆర్ సారు మాకు వ్యవసాయం చేసుకునేందుకు ఎకరానికి ఏడాదికి రూ.10వేలు ఇవ్వడం సంతోషంగా ఉన్నది. నాకు నాలుగు ఎకరాల భూమి ఉన్నది. నా ఖాతాలో రూ.20వేలు వేశారు. విత్తనాలు, ఎరువులకు ఈ డబ్బులు సరిపోతాయి. ఇది వరకు ఎరువుల కోసం కుస్తీ పట్టుకునేవాళ్లం. ఇప్పుడు కేసీఆర్ సారు దయతో పెట్టుబడి డబ్బులతో కావాల్సినన్ని ఎరువుల బస్తాలను కొనుగోలు చేసి నిల్వ ఉంచుకుంటున్న. గిట్ల అన్ని సౌలత్లు చేసిన కేసీఆర్ సారుకు రుణపడి ఉంటాం.
– పెద్దోల సాయిలు, రైతు, మాగి
భిక్కనూరు, జూలై 5: సమైక్య పాలనలో వ్యవసాయం చేయాలంటే భయపడేవాళ్లం. నీళ్లు లేక, పెట్టుబడికి డబ్బులు లేక ఇబ్బందిపడేవాళ్లం. ధైర్యం చేసి పంటలు వేసినా పండుతాయన్న నమ్మకం లేకుండే. అప్పులు ఎక్కువ కావడంతో పట్టణాల్లో పనిచేసే వాళ్లం. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత వ్యవసాయానికి మించిన ఉద్యోగం లేదని, సగౌరవంగా బతికేలా చేసిండు. పెట్టుబడిసాయంగా ఎకరానికి రూ.10వేలను మా బ్యాంకు ఖాతాల్లో వేస్తూ గుండె ధైర్యాన్ని నింపిన మహానుభావుడు కేసీఆర్.
– పెరం భూమయ్య, రైతు, జంగంపల్లి
నిజాంసాగర్, జూలై 5: సీఎం కేసీఆర్ అధికారంలో ఉండడంతోనే రైతులకు మేలు చేకూరుతున్నది. నాకు ఎకరంన్నర పొలం ఉన్నది. రూ.7500 నా ఖాతాలో జమ అయ్యాయి. వాటిని తీసుకువచ్చి వ్యవసాయ పనులను ప్రారంభించిన. ఇంతకుముందు అప్పు కోసం షావుకార్ల దగ్గర కాపలా కాచి మూడు రూపాయల వడ్డీకి తీసుకువచ్చి మళ్లీ వారికే ధాన్యాన్ని విక్రయించేవాళ్లం. అన్నీ పోను కైకిలి పడేది. అలాంటిది.. కేసీఆర్ సార్ పెట్టుబడి డబ్బులు ఇస్తుండ్రు. పండిన పంటను కొనుగోలు చేస్తుండ్రు. అందుకే రైతులందరం సంతోషంగా సాగు చేసుకుంటున్నం.
– బాబియా, రైతు, వడ్డేపల్లి
నిజాంసాగర్, జూలై 5: విత్తనాలు కొనే సమాయానికి కేసీఆర్ రైతుబంధు పైసలు ఇచ్చి ఉద్దెర తీసుకునే అవసరం లేకుంట చేసిండు. సమయానికి పెట్టుబడి పైసలు వస్తుండడంతో ఎవుసం చేయాలనే హుషారు వస్తున్నది. విత్తనాలు, ఎరువులకు పైసలెట్ల, అప్పు ఎక్కడ తీసుకురావాలె అనే భయం లేదు. కేసీఆర్ సారు ఇచ్చిన పైసలతో ఊళ్లో ప్రతి ఒక్కరూ పొలం బాట పట్టిండ్రు. నాకు ఎకరంన్నర భూమి ఉన్నది. రూ.7500 పెట్టుబడి డబ్బులు అందాయి. నిజాంసాగర్ నీటిని విడుదల చేశారు. నీళ్లు ఉన్నాయి. చేతిలో పెట్టుబడి డబ్బులు ఉన్నాయి.
– బాగమోల పోచయ్య, రైతు, బుర్గుల్
భీమ్‌గల్, జూలై 5: గతంలో పొలం పనులు మొదలైతున్నాయంటే పెట్టుబడి డబ్బుల కోసం మానాన్న వాళ్లు అప్పుల కోసం వ్యాపారులపై ఆధారపడేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగలా మార్చారు. పనులు మొదలు పెట్టాలంటే ప్రభుత్వమే మొదట డబ్బులను మా ఖాతాల్లో జమ చేస్తున్నది. నిజంగా ఇది చాలా గొప్ప పథకం. నాలాంటి యువరైతులకు నిజంగా వ్యవసాయంపై మక్కువ పెరుగుతుంది. ఇది రైతు ప్రభుత్వం.
– తోట ప్రతీప్,యువ రైతు, భీమ్‌గల్
మోర్తాడ్, జూలై 5: వానకాలం రైతుబంధు పైసలు పసుపు పంట వేసేందుకు ఉపయోగించిన. నాకు రెండెకరాల 36గుంటల భూమి ఉన్నది. రూ.14,500 రైతుబంధు పైసలు వచ్చినయి. ఈ మొత్తం కూడా పసుపు పంట వేసేందుకు ఉపయోగపడ్డాయి. ఇంతకుముందు వానలు చాలయినయంటే సాగు కోసం నానా కష్టాలు పడేటోళ్లం. చేతిలో డబ్బులు లేక ఇబ్బందిపడేవాళ్లం. ఇప్పుడు మాకు ఆ బాధ తప్పింది. రైతుబంధు పథకం ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ నిజంగా ముందుచూపు కలవాడు.
– పర్స నరేశ్, రైతు, దోన్పాల్
మోర్తాడ్, జూలై 5: వానకాలం వచ్చిందంటే రైతుబంధు పైసలెప్పుడస్తయా అని ఎదురుచూస్తం. ఎవరికన్నా వచ్చినయా అని ఒకరినొకరు అడుగుకుంటం. పైసలచ్చినయంటే పానం లేచస్తది. సాగుకు అవసరమయ్యే ఖర్చులెల్తయన్న సంతోషమస్తది. వానలు చాలయినయంటే విత్తనాలు, ఎరువులు, మందులు కొనుడుగురించే ఆలోచనలు ఉంటయి. ఇసొంటి టైంల రైతుబంధు రావడం మాకందరికీ సంతోషంగా ఉన్నది. నాకు రెండెకరాలు ఉన్నది. రైతుబంధు వచ్చినప్పుడల్లా రూ.10వేలు వస్తున్నయి.
– ఏలేటి సాయన్న, రైతు, పాలెం