నిజామాబాద్ రూరల్, నవంబర్ 16 : డిచ్పల్లి మండలకేంద్రంలోని గాంధీనగర్ శివారులో రహదారి పక్కన గురువారం రూరల్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరైన ఈ సభకు రూరల్ నియోజకవర్గంలోని ఏడు మండలాలు, వివిధ గ్రామాల నుంచి ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు తండోపతండాలుగా తరలివచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు సభ ఉందని సమాచారమందుకున్న జనాలు.. వివిధ గ్రామాల నుంచి ఉదయం 11 గంటల నుంచే సభా ప్రాంగణానికి చేరుకోవడం ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటల వరకు సభాప్రాంగణం ప్రజలతో పూర్తిగా నిండిపోయింది. సభ పక్కనే ఉన్న నిజామాబాద్, డిచ్పల్లి రహదారిపైకి కూడా జనాలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. సీఎం కేసీఆర్ సభా ప్రాంగణానికి 4.15 గంటలకు చేరుకున్నారు. అయినప్పటికీ వేలాది సంఖ్యలో తరలివచ్చిన జనాలు సీఎం ప్రసంగం వినేందుకు ఆసక్తి, ఓపికతో వేచి ఉన్నారు. దివ్యాంగులు, వృద్ధులు, మహిళలు, యువకులు, రైతులతో పాటు మహిళలు చంటిబిడ్డలను ఎత్తుకొని సభకు హాజరయ్యారు. సభ ప్రాంగణంలో భారీ ఫ్లెక్సీలు, కటౌట్లు, గులాబీ తోరణాలను ఏర్పాటు చేయడంతో మండల కేంద్రం, సభాప్రాంగణం గులాబీ మయమైంది.
సీఎం పాల్గొనే ప్రజాశీర్వాద సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని గ్రామాల బీఆర్ఎస్ శ్రేణులు సమష్టి కృషి చేసి సభను విజయవంతం చేశారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నిండింది. సభ సక్సెస్ కావడం, బీఆర్ఎస్ నాయకుల ముమ్మర ప్రచారం, ప్రజలు, వివిధ సంఘాల మద్దతుతో బాజిరెడ్డి గోవర్ధన్ భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని బీఆర్ఎస్ శ్రేణులు ధీమా వ్యక్తంచేస్తున్నారు.
డిచ్పల్లి, నవంబర్ 16 : రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి మండల కేంద్రంలో గాంధీనగర్ వద్ద గురువారం నిర్వహించిన సీఎం ప్రజాఆశీర్వాద సభను విజయవంతం చేసిన ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులకు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు వచ్చే వరకు మూడు గంటల పాటు వేచి ఉండి, సీఎం ప్రసంగాన్ని శ్రద్ధగా విని చప్పట్ల ద్వారా ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రూరల్ నియోజకవర్గం సీఎం కేసీఆర్ సహకారంతో పదేండ్లలో ఎంతో అభివృద్ధి చెందిందని, సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారని పేర్కొన్నారు. కారు గుర్తుకే ఓటు వేసి తనను మరోసారి ఆశీర్వదించాలని కోరారు.
‘ఇందల్వాయి, నవంబర్ 16 : బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వంపైనే మాకు నమ్మకం ఉన్నది. ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు, రూరల్‌ను అభివృద్ధి చేస్తున్న బాజిరెడ్డి గోవర్ధన్‌కు మద్దతుగా నిలుస్తాం.
తెలంగాణ ప్రజల కోరిక నెరవేర్చిన సీఎం కేసీఆర్‌ను మా గుండెల్లో పెట్టుకుంటాం. మాలాంటి పేదలను సీఎం కేసీఆర్ గుర్తించి ఎన్నో పథకాలు తెచ్చిండు. రూరల్‌లో కూడా బాజిరెడ్డి గోవర్ధన్ ఎన్నో మంచి చేసిండు. పేదల కోసం పాటుపడుతున్న సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న అభివృద్ధి బీఆర్ఎస్ హయాంలో జరిగింది. పేదలకు కావాల్సిన వాటిని సీఎం కేసీఆర్ ముందుచూపుతో వివిధ పథకాలను తీసుకువచ్చారు. ఇలాంటి ప్రభుత్వానికి ఎప్పుడూ అండగా ఉంటాం.
రాష్ట్ర ప్రజల అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్లీ రావాలి. ప్రజలు సీఎం కేసీఆర్, రూరల్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ను ఆశీర్వదించాలి. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ రూరల్ అభ్యర్థి గెలుపు కోసం పాటుపడుతా. మూడోసారీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది.
రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ సారే మళ్లీ రావాలి. నాలాంటి దివ్యాంగులకు రూ. 4 వేల ఆసరా పెన్షన్ ఇచ్చి ఆదుకుంటున్నారు. ఈ ఆసరా పెన్షన్ మాలాంటి వారందరికీ ఎంతగానో ఉపయోగపడుతున్నది. దివ్యాంగుల బాధను గుర్తించిన కేసీఆర్ సార్ అడగకుండానే పెన్షన్‌ను పెంచడం సంతోషకరం.
ప్రజాశీర్వాదమున్న రూరల్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గెలుపు ఖాయం. రూరల్‌లో ఆయన ఎంతో అభివృద్ధి పనులు చేశారు. ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో పదేండ్లలో రూరల్ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందింది. బాజిరెడ్డి భారీ మెజార్టీతో హ్యాట్రిక్ సాధిస్తారు.