అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. అన్ని కులాలు, మతాలను సమదృష్టితో చూస్తూ ధర్మ రక్షకుడిగా నిలుస్తున్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ సంబురాలతో పాటు రంజాన్, క్రిస్మస్ పండుగలనూ అధికారికంగా నిర్వహించేందుకు ఏటా భారీగా నిధులు వెచ్చిస్తున్నారు. ఆలయాలు, ప్రార్థన మందిరాల నిర్మాణాలకూ చేయూతను ఇస్తున్నారు. అలాగే, అర్చకులు, ఇమామ్, మౌజాంలకు గౌరవ వేతనం అందజేస్తున్నారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ ధూపదీప నైవేద్య పథకం కింద ఇస్తున్న రూ.6 వేలను రూ.10 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 600 మంది అర్చకులకు లబ్ధి చేకూరనున్నది.
నిజామాబాద్ కల్చరల్, సెప్టెంబర్ 1 : ఉమ్మడి రాష్ట్రంలో ఆలయాలు ప్రాభవాన్ని కోల్పోయాయి. పట్టించుకునేవారు లేకపోవడంతోపాటు ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలు సమర్పించే వారే కరువయ్యారు. ఫలితంగా పేద బ్రాహ్మణులు ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి అటు ఆలయాలకు పూర్వవైభవం తేవడంతో పాటు అర్చకులను సైతం ఆదుకునేలా కార్యక్రమాలను అమలుచేశారు. ఆలయాపై ఆధారపడి జీవిస్తున్న అర్చకులకు భరోసా కల్పించేందుకు ధూపదీప నైవేద్య పథకాన్ని అమలు చేశారు.
ధూప దీప నైవేద్యాల కోసం రూ. 2వేలు, అర్చకులకు రూ. 4వేల చొప్పున 2015 సంవత్సరం నుంచి ప్రభుత్వం అందిస్తున్నది. ఇటీవల విప్రహిత బ్రాహ్మణ సదనం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ధూపదీప నైవేద్య పథకానికి అందిస్తున్న అలవెన్సును పెంచుతామని ప్రకటించి, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఈ పథకం కింద ప్రభుత్వం రూ. 6వేలు ఇస్తుండగా, ఇందులో పూజా సామగ్రి కోసం 2వేలు, అర్చకుడి వేతనంగా రూ. 4వేలు అందించేది. ఈ మొత్తాన్ని ప్రస్తుతం రూ. 10వేలకు పెంచారు. దీంతో అర్చకులు నెలకు రూ. 6వేల వేతనాన్ని అందుకోనున్నారు. అలవెన్సు పెంపుతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 600 మంది అర్చకులకు లబ్ధి చేకూరనున్నది.
కామారెడ్డిలో 265.. నిజామాబాద్‌లో 335 మంది అర్చకులు
ధూపదీప నైవేద్యం పథకం కింద ఎంపిక చేసిన ఆలయాల్లో కామారెడ్డి జిల్లాలో 265 మంది, నిజామాబాద్ జిల్లాలో 335 మంది అర్చకులు సేవలు అందిస్తున్నారు. అలవెన్సును రూ. 10వేలకు పెంచడంతో ఈ పథకం ద్వారా ఉమ్మడి జిల్లాలో మొత్తం 600 మందికి లబ్ధి చేకూరనున్నది. దీంతో అన్ని కులాలు, మతాలను సమానంగా ఆదరిస్తున్న సీఎం కేసీఆర్ పదికాలాల పాటు అధికారంలో కొనసాగాలని అర్చకులు దీవిస్తున్నారు.
పెంపు హర్షణీయం..
అర్చకుల గౌరవభృతిని రూ. 10వేలకు పెంచడం హర్షణీయం. పెరిగిన ధరల దృష్ట్యా ధూపదీప నైవేద్యాలకు గతంలో ఇబ్బంది ప డ్డాం. అలవెన్సు పెంచడంతో అర్చకుల ఇబ్బందులు దూరమవు తాయి. ఆలయాలు నూతన శోభను సంతరించుకుంటాయి.
-అరవిందులు శర్మ, వేల్పూర్
కేసీఆర్‌ది గొప్ప మనస్సు
అర్చకుల వేతన పెంపు.. సీఎం కేసీఆర్ గొప్ప మనస్సుకు నిదర్శనం. ఉమ్మడి రాష్ట్ర పాలనలో అర్చకులకు కేవలం రూ. 2,500 మాత్రమే ఇచ్చేవారు. దీనిని సీఎం సార్ మొదట రూ. 6వేలు చేశారు. తాజాగా రూ. 10వేలకు పెంచడం ఆనందదాయకం
-దోసపాటి నవీన్‌కుమార్ శర్మ, నవీపేట్
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు
సీఎం కేసీఆర్ అర్చకులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం ఆనందంగా ఉంది. రూ.10వేలు పెంపుతో పూజా కార్యక్రమాలను మరింత వైభవంగా నిర్వహించే అవకాశం కలుగుతుంది.
-జంగం సంగాయప్ప, నాగల్గావ్, జుక్కల్ మండలం
సీఎంకు కృతజ్ఞతలు
పెద్ద మనసుతో అర్చకుల వేతనాలు పెంచిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు. ఇచ్చిన హామీ ప్రకారం అర్చకుల గౌరవభృతిని రూ. 10వేలకు పెంచడంతో ఉమ్మడి జిల్లాలోని అర్చకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
-అంజనప్ప, అధ్యక్షుడు డీడీఎన్, కామారెడ్డి
అర్చకులకు ఇది తీపి కబురు
ఎన్నో ఏండ్ల నుంచి అతి తక్కువ గౌరవ వేతనంతో పూజలు చేస్తున్న అర్చకులకు సీఎం కేసీఆర్ శ్రావణ మాసంలో తీపి కబురు అందించారు. కులమతాలకు అతీతంగా కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను రూపొందిస్తూ అమలు చేస్తున్నారు.
-సత్యనారాయణ శర్మ, బోధన్