నందిపేట్, మార్చి 17 : దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) విస్తరణ, బలోపేతం దిశగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఈ నెల 26న మహారాష్ట్రలోని కాందార్ లోహలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి శుక్రవారం పరిశీలించారు. మహారాష్ట్ర నేతలతో ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వమే దేశానికి శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. దేశానికి బీజేపీ శాపమని, బీఆర్ఎస్సే ఆశాదీపమన్నారు. మోదీ ప్రభుత్వం కోట్ల రూపాయల విలువ గల ప్రభుత్వరంగ ఆస్తులను అదానీ వంటి వారికి దోచి పెడుతున్నదని మండిపడ్డారు. ప్రజల ఆకాంక్షలను తీర్చగలిగిన మనస్సున్న మహానేత కేసీఆర్ అని పేర్కొన్నారు. తెలంగాణ మోడల్ దేశమంతా అమలు చేయాలన్నదే కేసీఆర్ కృతనిశ్చయమన్నారు.
కేసీఆర్‌లాంటి సీఎం తమకు ఉంటే బాగుండునని ఇతర రాష్ర్టాల ప్రజ లు కోరుకుంటున్నారని తెలిపారు. కేసీఆర్ వంటి గొప్ప నాయకుడికి సంపూర్ణ మద్దతు ప్రకటించి, తమ జీవితాల్లో గుణాత్మక మార్పునకు తామే నాంది పలకాలని దేశ ప్రజలు కోరుకుంటున్నట్లు నాందేడ్ సభ సాక్షిగా స్పష్టమైందని తెలిపారు. మహారాష్ట్రలోని ఇతర పార్టీలకు చెందిన నాయకులు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు జీవన్‌రెడ్డి వెల్లడించారు. ఏర్పాట్ల పరిశీలనలో బీఆర్ఎస్ పార్టీ జాతీయ జనరల్ సెక్రటరీ హిమాన్షు తివారి, పార్టీ మహారాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడు మాణిక్ కదం ప్రవీణ్, నాయకులు శివాన్క్, అంకిత్ యాదవ్, గణేశ్‌బాబు, రావు కదం ఉన్నారు.
ఎమ్మెల్యేలు షకీల్, జీవన్‌రెడ్డితో నాందేడ్ జడ్పీ మాజీ వైస్ చైర్మన్ భేటీ
బోధన్, మార్చి 17: నాందేడ్ జడ్పీ మాజీ వైస్ చైర్మన్ దిలీప్ దోంగ్డే బీఆర్ఎస్లో చేరనున్నారు. ఈ మేరకు ఆయన నాందేడ్‌లో బసచేసిన ఆర్మూర్, బోధన్ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, షకీల్‌తో శుక్రవారం భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ సమక్షంలో శనివారం బీఆర్ఎస్లో ఆయన చేరనున్నారు. ఈ నేపథ్యంలో జీవన్‌రెడ్డి, షకీల్‌ను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. దిలీప్ దోంగ్డే తండ్రి శంకర్ దోంగ్డే ఇటీవల ఎన్సీపీ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్ష పదవికి, ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామాచేసి బీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే. శంకర్ దోంగ్డే లోహ నియోజవర్గం మాజీ ఎమ్మెల్యే. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. తండ్రి ఇప్పటికే బీఆర్ఎస్లో చేరగా, కుమారుడు దిలీప్ దోంగ్డే శనివారం చేరుతున్నారని స్థానిక బీఆర్ఎస్ నాయకులు తెలిపారు.