పంద్రాగస్టు ముందర ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు సోమవారం జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని 4,098 మంది కార్మికులకు ప్రయోజనం కలుగనున్నది. ఇక నుంచి వారంతా ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. కేసీఆర్ సర్కారు నిర్ణయంపై కార్మికుల్లో నూతనోత్సాహం నెలకొన్నది. ప్రభుత్వ ప్రకటన వెలువడిన వెంటనే ఆర్టీసీ ఉద్యోగులు సంబురాల్లో మునిగిపోయారు. పలుచోట్ల సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. వేలాది మంది కార్మికుల కుటుంబాల్లో ఆనందం నింపిన సీఎం కేసీఆర్‌కు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ కృతజ్ఞతలు తెలిపారు.
నిజామాబాద్, జూలై 31(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. కార్మిక వర్గమంతా ఆనందించేలా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్వయంగా వెల్లడించారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టీసీలో పని చేస్తున్న కార్మికులు, ఉద్యోగులంతా సంబురపడుతున్నారు. కేసీఆర్ సంచలన నిర్ణయాన్ని తీసుకోవడంతో ఆర్టీసీలోని ప్రతి ఉద్యోగి తెలంగాణ ప్రభుత్వ చొరవను కొనియాడుతున్నారు. యూనియన్లకు అతీతంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందిస్తున్నారు. కరోనా సమయంలో కుదేలైన ఆర్టీసీ తీవ్రమైన నష్టాలను మూటగట్టుకున్నది. ఒకానొక దశలో గడ్డుకాలాన్ని ఎదుర్కొన్నది. సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి కష్టకాలంలో ఆర్టీసీకి కొండంత అండగా నిలిచారు. ఆర్టీసీని లాభాల బాటలోకి పట్టించేందుకు ఎనలేని కృషి చేశారు. ఇందులో భాగంగానే ఆర్టీసీ కార్గో వంటి సేవలను తీసుకువచ్చారు. తద్వార ఆర్టీసీని నష్టాల నుంచి లాభాల వైపునకు నడిపించారు.
ఆర్టీసీకి బాజిరెడ్డి సారథ్యం…
ఆర్టీసీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకోవడంతో అంతటా ఆనందోత్సవాలు వెల్లివిరుస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఉద్యోగులకు ఆది నుంచి సీఎం కేసీఆర్ అండగా నిలిచారు. వారి ఉద్యమ స్ఫూర్తిని కొనియాడుతూ పని భారాన్ని తగ్గిస్తూనే జీతాలను గతం కన్నా మెరుగ్గా పెంచి అమలు చేశారు. కార్మికుల ఏండ్ల కలను నెరవేర్చి ఇప్పుడు శాశ్వతంగా ఉద్యోగ భద్రతను కల్పించడంతో ముఖ్యమంత్రి తన మాటను నిలబెట్టుకున్నారు. ఈ కీలకమైన సమయంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆర్టీసీకి చైర్మన్‌గా ఉండడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఆర్టీసీ చైర్మన్‌గా బాజిరెడ్డి గోవర్ధన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సీఎం కేసీఆర్ మార్గదర్శకంలో వినూత్నమైన నిర్ణయాలు అమలవుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగుల సంక్షేమ కార్యక్రమాలను గతంతో పోలిస్తే అనేక విధాలుగా అమలు చేశారు. ఆరోగ్యపరమైన రక్షణను కల్పించారు. డీఏ పెంపు విషయంలోనూ కీలకమైన నిర్ణయాలు తీసుకుని అమలు చేశారు. ప్రజలకు సైతం వినూత్నమైన టికెట్ స్కీములను ప్రవేశపెట్టి ప్రయోజనాలను అందించారు. విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టారు. కొత్త రూట్లలో బస్సులను నడిపించారు. బాజిరెడ్డి గోవర్ధన్ హయాంలో ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులకు మంచి ప్రయోజనాలు దక్కినైట్లెంది.
ప్రభుత్వ ఉద్యోగులుగా కార్మికులు..
ఉమ్మడి జిల్లా పరిధిని ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్‌గా పరిగణిస్తున్నారు. ఇందులో మొత్తం 5డిపోలున్నాయి. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, కామారెడ్డి, బాన్సువాడ డిపోల ద్వారా నిత్యం వందలాది బస్సులు తిరుగుతున్నాయి. తక్కువ చార్జీల్లోనే సుదూర ప్రాంతాలకు సురక్షితంగా ప్రయాణికులను చేరవేస్తూ కీలక భూమికను ఆర్టీసీ పోషిస్తున్నది. నిజామాబాద్ రీజియన్‌లో 1200 బస్సులుండగా 4,809 మంది ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తున్నారు. అత్యధికంగా నిజామాబాద్ 1, 2 డిపోల్లో 650 బస్సులుండగా 2800 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. బాన్సువాడలో 106 బస్సులుండగా 490 మంది, కామారెడ్డిలో 140 బస్సులు, 603 మంది, ఆర్మూర్‌లో 88 బస్సులు, 460 మంది, బోధన్‌లో 114 బస్సులుండగా 450 మంది సిబ్బంది ప్రజా రవాణాలో పాలుపంచుకుంటున్నారు. వీరంతా కార్పొరేషన్ పరిధి నుంచి ప్రభుత్వ నిర్ణయం మేరకు ప్రభుత్వంలో భాగం కాబోతున్నారు. ఉద్యోగ భద్రతను దక్కించుకోబోతున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆర్టీసీ కార్మికులు సంబురాలు చేసుకుంటున్నారు.
సంచలనాలు కేసీఆర్‌తోనే సాధ్యం…
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా ప్రజా రవాణా మరింత పటిష్టంగా మారబోతున్నది. రాష్ట్ర మంత్రిమండలి తీసుకున్న నిర్ణయం సంచలనాత్మకమైనది. ఇలాంటి నిర్ణయాలు కేవలం సీఎం కేసీఆర్‌తోనే సాధ్యం. ప్రజల అవసరాలను తీర్చేందుకు, వారి గమ్యస్థానాలకు చేరవేసేందుకు లాభపేక్ష లేకుండా ఆర్టీసీ పనిచేస్తున్నది. ఆర్టీసీ విలీనం ద్వారా కార్మికులందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించబడతారు. సంస్థ చైర్మన్‌గా కార్మికులు, ఉద్యోగులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వేలాది మంది కుటుంబాల్లో ఆనందం నింపిన కేసీఆర్‌కు ధన్యవాదాలు. ఈ శుభ సందర్భంలో ఆర్టీసీకి చైర్మన్‌గా నేనుండడం ఆనందంగా ఉంది. – బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసీ చైర్మన్
ఆర్టీసీ కార్మికుల్లో ఆనంద హేల
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం
నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించడంతోపాటు అందులో పనిచేస్తున్న కార్మికులు, సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తిస్తూ రాష్ట్ర మంత్రివర్గ మండలి నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆర్టీసీని అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలతో కార్మికులు ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నారు. దీనికి తోడు ప్రస్తుతం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో సంబురపడుతున్నారు.
స్వరాష్ట్ర సాధన ఫలితం దక్కింది..
చాలా రోజుల తర్వాత ఆర్టీసీ కార్మికుల మోములో నవ్వు లు చూడబోతున్నాం. తెలంగాణ రాష్ట్రం సాధించినందు కు ఫలితాన్ని పొందిన అనుభూతి కలుగుతున్నది. సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు. ఆర్టీసీని అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారు. ఆర్టీసీలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. దీంతో ఆర్టీసీ ఆర్థిక పరిపుష్టిని సాధిస్తున్నది. తాజా నిర్ణయంతో ఆర్టీసీతోపాటు కార్మికులకు ఎంతో లబ్ధి చేకూరుతుంది.
– బసంత్, ఎన్ఎంయూ రాష్ట్ర మాజీ సంయుక్త కార్యదర్శి
సీఎం కేసీఆర్‌కు పాదాభివందనాలు
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీ నం చేయడంపై సీఎం కేసీఆర్‌కు పాదాభివందనం చేస్తున్నాం. కార్మికులందరం ఆయనకు రుణపడి ఉం టాం. ఆర్టీసీ అభివృద్ధికి మా వంతు కృషిచేస్తాం. కష్టపడి పనిచేస్తాం. సీఎం కేసీఆర్ తీసుకొనే ప్రతి నిర్ణయాన్ని అమలు చేసేందుకు సహకరిస్తాం. విలీనం చేయడంతో ఆర్టీసీ ఎంతో అభివృద్ధి చెందుతుంది. బడ్జెట్లో ఆర్టీసీకి ఇంతకు ముందు కూడా నిధులు కేటాయించింది. ఇక నుంచి బడ్జెట్లో మరింత ఎక్కువ నిధులు లభిస్తాయి. ఆర్టీసీ గట్టెక్కుతుంది.
– గిరి, ఎన్ఎంయూ మాజీ కార్యదర్శి, బాన్సువాడ డిపో
బహుత్ అచ్చా కియే సీఎం సాబ్
ఆర్టీసీకో గవర్నమెంట్మే లేనేకా డిసిషన్ లియే. కేసీఆర్ సాబ్ బహుత్ అచ్చా కియా. యే కామ్ సే ఆర్టీసీకే సాత్‌సాత్, హమ్కో బహుత్ ఫాయిదా హోతా. జీవితాంతం సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. ఆయన నిర్ణయం మాకు ఎంతో లాభాన్ని చేకూర్చింది.
– గౌసొద్దీన్, ఆర్టీసీ డ్రైవర్, బాన్సువాడ
చారిత్రాత్మక నిర్ణయం
బీర్కూర్, జూలై 31: నేను 10 సంవత్సరాలుగా ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాను. చాలీచాలని జీతంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. మంత్రిమండలిలో నిర్ణయం తీసుకున్నారనే వార్త టీవీలో చూసి మా కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. ఈ నిర్ణయంతో సీఎం కేసీఆర్ చరిత్ర తిరగరాశారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంతో ఆర్టీసీ కార్మికులతోపాటు మా కుటుంబసభ్యులందరం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
పి.సదానందం, ఆర్టీసీ డ్రైవర్, బీర్కూర్
గత పాలకులు పట్టించుకోలే..
నేను గత 20 సంవత్సరాలుగా ఆర్టీసీలో ఉద్యోగం చేస్తున్నా. ఎన్నో ప్రభుత్వాలకు మా విన్నపాలు వినిపించినా మాటల వరకే పరిమితమైంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా మా భవిష్యత్తు ఇలాగే ఉంటుందా అని భయపడ్డాం. మాట మిద నిలబడ్డ కేసీఆర్ గత పాలకులకు భిన్నంగా దేశంలోనే వివిధ రాష్ర్టాలకు ఆదర్శంగా మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేశారు. మేము కూడా ప్రభుత్వ ఉద్యోగులమని గర్వంగా చెప్పుకోగలుగుతాం. ఇంత మేలు చేసిన సీఎం కేసీఆర్ సారుకు ఆర్టీసీ ఉద్యోగులే కాదు మా కుటుంబాలు సదా రుణపడి ఉంటాం.
-మొండి గంగారాం, ఆర్టీసీ డ్రైవర్, బీర్కూర్
ప్రభుత్వంలో విలీనం చేయడం హర్షణీయం..
టీఎస్ఆర్టీసీని తెలంగాణ ప్రభుత్వంలో విలీనం చేయడం హర్షణీయం. గత ప్రభుత్వాలతో సాధ్యం కాని ఈ నిర్ణయం సీఎం కేసీఆర్‌తోనే అయ్యింది. సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
– రాజు, డ్రైవర్, కామారెడ్డి
ఆర్టీసీ భవిష్యత్తు మారబోతుంది..
సీఎం కేసీఆర్ నిర్ణయంతో టీఎస్ఆర్టీసీ భవిష్యత్తు మారబోతుంది. గతంలో ఆర్టీసీ ఉద్యోగులు ఎంతో ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ప్రభుత్వంలో విలీనం కానుండడంతో ఇబ్బందులు ఉండవు. దీంతో ఆర్టీసీ మరింత అభివృద్ధి చెందుతుంది.
– బాల్‌రాజ్ గౌడ్, కండక్టర్, కామారెడ్డి
మా కల నెరవేరింది..
బాన్సువాడ టౌన్: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ చేసిన ప్రకటనతో మా ఆనందానికి అవధుల్లేవు. 18ఏండ్ల నుంచి ఆర్టీసీలో పని చేస్తున్న. ఉద్యోగం చేస్తున్నాననే మాట తప్పించి.. ప్రతి నెలా ఓ ప్రైవేటులో పనిచేసే వారిలా ఉండేది. చాలీచాలని జీతాలతో ఇబ్బందికరంగా ఉండేది. మా ఏండ్లనాటి కలను నెరవేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు ఇవ్వడంపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.
– చింత రాములు, కండక్టర్, బాన్సువాడ డిపో
భరోసా వచ్చింది..
ఆర్టీసీలో 25 ఏండ్లుగా డ్రైవర్‌గా పని చేస్తున్నాను. కత్తిమీద సాములాంటి పని. రోజూ వందలాది మంది ప్రాణాలను మా చేతుల్లో పెట్టి ప్రయాణిస్తారు. డ్యూటీకి వెళ్లి తిరిగి వచ్చే వరకు భయంతో బతకాల్సిన ఉద్యోగం. పెద్ద బాధ్యత, కష్టమైన ఉద్యోగం అయినా జీతం మాత్రం ప్రైవేటు ఉద్యోగికి వచ్చేలా ఉండేది. ప్రభుత్వంలో విలీనం చేయడంతో జీతభత్యాలు పెరుగుతాయి. మాకు ఏమైనా అనుకోని సంఘటన జరిగినా కుటుంబానికి ఒక భరోసా ఉంటుందనే నమ్మకం వచ్చింది.
– శంకర్, ఆర్టీసీ డ్రైవర్, బాన్సువాడ డిపో
ఉద్యోగ భద్రత ఏర్పడింది..
తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కావడంతో మాకు ఇతర శాఖల మాదిరిగా పీఆర్సీ అమలవుతుంది. ఉద్యోగ భద్రత ఏర్పడింది. రిటైర్మెంట్ తర్వాత పెన్షన్, ఇతరాత్ర బెనిఫిట్స్ వస్తాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు మా తరపున, మా కుటుంబాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు.
– శంకర్ గౌడ్,కండక్టర్, బాన్సువాడ డిపో