మంజీర తీరాన ప్రజా ప్రవాహం పోటెత్తింది. నదికి ఇటువైపు బాన్సువాడ, అటువైపు జుక్కల్ ప్రాంతం.. గులాబీ వనంగా మారింది. బీఆర్ఎస్ సోమవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలకు ప్రజానీకం వెల్లువెత్తింది. సీఎం కేసీఆర్ హాజరైన ఈ రెండు సభలు సూపర్ సక్సెస్ అయ్యాయి. ప్రజా సంద్రాన్ని తలపించిన జుక్కల్, బాన్సువాడ సభలు.. గులాబీ బలాన్ని చాటడమే కాదు. ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరుగెత్తించేలా చేశాయి. బీఆర్ఎస్ అభ్యర్థులపై అభిమానంతో తరలివచ్చిన జన సమూహాన్ని చూసి కేసీఆర్ సైతం అచ్చెరువొందారు. గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తూనే స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే హన్మంత్ షిండేలకు బంపర్ మెజార్టీ అందించాలని కోరారు. స్పీకర్ను లక్ష్మీపుత్రుడని అభివర్ణించిన కేసీఆర్.. బాన్సువాడను బంగారు కొండగా మార్చారని ప్రశంసించారు. హన్మంత్ షిండే ప్రజల మనిషి అని, ప్రజా సమస్యల కోసమే నిరంతరం తపిస్తుంటారని కితాబునిచ్చారు. పోచారం, షిండేను ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు.
ప్రజా నాయకుడు, పెద్దమనిషి పోచారం శ్రీనివాసరెడ్డి. అజాత శత్రువు. ఎంత పెద్ద పదవిలో ఉన్నా రుబాబ్ చూపించని వ్యక్తి. అందుకే ఆయన అంటే నాకు, మంత్రులకు, అందరికీ గౌరవం. ఈ సభకు వచ్చిన జనాలను చూస్తుంటే పోచారం లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తడనిపిస్తుంది. ఆయనను భారీ మెజార్టీతో గెలిపిస్తే వచ్చే ప్రభుత్వంలో సముచితమైన స్థానం దక్కుతుంది. పెద్ద పదవిని అలంకరిస్తాడు.
జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఎంతో సౌమ్యుడు, ప్రజల మనిషి. నెలలో 25 రోజులు ప్రజల్లోనే ఉండే వ్యక్తి. ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలి. ఏనాడూ నా వద్దకు వ్యక్తిగత పనుల గురించి రాలేదు. వచ్చినప్పుడల్లా నియోజకవర్గ ప్రజల సమస్యలు, సాదకబాధకాలను తీర్చాలని మాత్రమే కోరేవాడు. నాగమడుగు పూర్తి చేసి నియోజకవర్గానికి నీళ్ల సమస్యలేకుండా చూడాలని కోరిండు. జుక్కల్లో ఇంకా చేయాల్సి పనులు ఉన్నాయి. షిండేను భారీ మెజార్టీతో గెలిపించండి. మిగిలిన పనులన్నీ పూర్తి చేయిస్తాడు.
బాన్సువాడ పట్టణానికి జనం పోటెత్తింది. సోమవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు తండోపతండాలుగా ప్రజలు తరలివచ్చారు. కండువాలు వేసుకొని, పార్టీ జెండా పట్టుకొని గులాబీ దండు మొత్తం కదిలింది. దీంతో బాన్సువాడ పట్టణం గులాబీమయమైంది. జననేత, సీఎం కేసీఆర్ను చూసేందుకు నియోజకవర్గానికి చెందిన ప్రజలు స్వచ్ఛందంగా సభలో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ప్రసంగిస్తున్నంత సేపు చప్పట్ల వర్షం కురిసింది. జై కేసీఆర్… జై పీఎస్ఆర్ అంటూ సభా ప్రాంగణమంతా మార్మోగింది. లక్ష్మీపుత్రుడైన పోచారం శ్రీనివాసరెడ్డిని లక్ష మెజారిటీతో గెలిపించాలని సీఎం కేసీఆర్ పిలుపునివ్వగా.. జనమంతా చేతులెత్తి మద్దతు పలికారు.