మోస్రా (చందూర్), ఆగస్టు 3: కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ కలిసికట్టుగా ముందుకెళ్లాల్సిన సమయంలో నాయకులు ఎవరికీ వారే యుమనా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీ కేడర్‌లో అయోమయం నెలకొన్నది. తాజాగా బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి.
ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క ఆదివారం బాన్సువాడ నియోజకవర్గంలోని చందూర్, మోస్రాలో పర్యటించగా.. ఆమె ముందే పార్టీలోని రెండు వర్గాల మధ్య నెలకొన్న ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి వర్గీయులు ఒకరినొకరు వ్యతిరేక నినాదాలు చేసుకోవడంతో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో గందరగోళం చోటుచేసుకున్నది.
నిజామాబాద్ నుంచి మోస్రా వస్తున్న సమయంలో గ్రామ శివారులో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి అనుచరులు మంత్రికి స్వాగతం పలుకుతూ రవీందర్‌రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేశారు. మండల సమీకృత భవన ప్రారంభోత్సవంలో మంత్రి ఎదుటే ఏనుగు రవీందర్‌రెడ్డి, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నది. ఇరువర్గాల నినాదాలతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. చందూర్‌లో పంచాయతీ భవన ప్రారంభోత్సవంలో ఏనుగు రవీందర్ రెడ్డి అనుచరులు ‘ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం..’ అంటూ నినాదాలు చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
రచ్చకెక్కిన ఆధిపత్య పోరు
మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారిందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. రానున్న స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీ గడ్డు కాలాన్ని ఎదుర్కోకతప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. పార్టీలోని నాయకులు వర్గాలుగా విడిపోయి ఎవరికీ వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, తరచూ విభేదాలు బయటపడుతున్నా హైకమాండ్ పట్టించుకోని పరిస్థితి. పార్టీని, నాయకులను క్రమశిక్షణగా ఉంచడంలో నాయకత్వలోపం స్పష్టం కనిపిస్తున్నది. పార్టీలో పెద్దల ఆదేశాలను పాటించిన దాఖలాలు కూడా కనిపించడంలేదు. బాన్సువాడ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల వరకు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేయగా.. పోచారం శ్రీనివాసరెడ్డి హస్తం పార్టీలో చేరడంతో అగ్గిరాజుకున్నది. ఏనుగు రవీందర్ రెడ్డితో విభేదాలు బయటపడ్డాయి. తాజాగా చందూర్, మోస్రాలో ఆదివారం సీతక్క పర్యటనలో పోచారం, ఏనుగు రవీందర్‌రెడ్డి వర్గీయుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ పార్టీ దుస్థితికి అద్దం పడుతున్నది.
నిత్య కలహాలు.. కుమ్ములాటలు..
బాన్సువాడ కాంగ్రెస్‌లో వర్గపోరు తారాస్థాయికి చేరుకోవడంతో తరచూ విభేదాలు పొడచూపుతున్నాయి. నియోజకవర్గ అభివృద్ధిని పక్కన బెట్టి పంతాలు, పట్టింపులకు వెళ్తుండడంపై ప్రజల్లో అసహనం వ్యక్తమవుతున్నది. అధికారపార్టీ నేతల తీరుపై ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. ప్రభుత్వ పరంగా నిర్వహించే కార్యక్రమాలకు వచ్చి తమ సమస్యలను మంత్రి, ప్రజాప్రతినిధులకు చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా ఉద్రిక్త పరిస్థితులు కల్పించడంపై మండిపడుతున్నారు. పార్టీలో నిత్యం కుమ్ములాటలు, వర్గపోరుతో సతమతమయ్యే ప్రజాప్రతినిధులు ప్రజా సంక్షేమాన్ని ఎలా పట్టించుకుంటారనే ప్రశ్నలూ ఉత్పన్నమవుతున్నాయి.