ఆర్మూర్‌టౌన్, మే 19: వేసవి సెలవుల్లో సరదాగా గడుపుదామని అమ్మమ్మ ఇంటికి వచ్చిన చిన్నారి కూలర్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఆర్మూర్ పట్టణంలో శనివారం రాత్రి చోటు చేసుకున్నది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గంగస్థాన్లో నివాసముండే వినీత్, దీపిక దంపతుల కుమార్తె శృతిక(6) విద్యుదాఘాతంతో మృతిచెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్‌లో నివాసముండే రేణుక..
నిజామాబాద్‌లో ఉంటున్న తన మనవరాలు శృతికను వేసవి సెలవులు ఉండడంతో గురువారం పెర్కిట్‌కు తీసుకువచ్చింది. శనివారం రాత్రి అమ్మమ్మ వంట పనుల్లో నిమగ్నమై ఉండగా శృతిక ఆడుకుంటూ కూలర్ వద్దకు వెళ్లింది.కూలర్‌ను తాకడంతో విద్యుత్‌షాక్‌కు గురై పడిపోయింది. వెంటనే సమీపంలోని ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలిక మృతి చెందినట్లు నిర్ధారించారు. అప్పటి వరకు కండ్ల ముందు ఆడుతూపాడుతూ తిరిగిన చిన్నారి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.