బాల్కొండ, సెప్టెంబర్ 10: క్రీడలు కేవలం శారీరక దారుఢ్యం కోసమే కాదని, జీవితంలో ఎదురుదెబ్బలు తగిలినప్పుడు వాటిని తట్టుకుని నిలబడేలా మనోధైర్యం పెంపొందించేందుకు ఉపయోగపడతాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి బాల్కొండ, ముప్కాల్, మెండోరా మండలాల అంతర పాఠశాలల క్రీడోత్సవాలను బాల్కొండలో ఆయన మంగళవారం ప్రారంభించారు. అంతకు ముందు విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ.. ఆటల్లో గెలుపోటములు సహజమని, అన్నింటినీ సమానంగా స్వీకరించాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లలను కేవలం చదువుల వైపే కాకుండా క్రీడల్లోనూ ప్రోత్సహించాలన్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వారు ఎందరో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించారని, వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.
తన వియ్యంకుడు, వ్యాపారవేత్త దయానందరెడ్డి సేవాభావం గురించి ప్రస్తావిస్తూ ప్రశంసలు కురిపించారు. రూ.60 లక్షలకు పైగా వెచ్చించి బాల్కొండ నియోజకర్గంతో పాటు జిల్లావ్యాప్తంగా అనేక పాఠశాలలకు అవసరమైన డెస్క్ బెంచీలు, స్పోర్ట్స్ మెటీరియల్, కంప్యూటర్లు ఇచ్చారన్నారు. ఎంఈవోలు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.