సారంగాపూర్, సెప్టెంబర్ 13 : నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్కాపూర్(ఏ) గ్రామశివారులో చిరుత సంచారం కొన్నిరోజులుగా కలకలం సృష్టిస్తోంది. నెలరోజుల నుంచి ఇదే ప్రాంతంలో చిరుత సంచరిస్తుండడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. గ్రామానికి చెందిన ఓ రైతు తన పొలం నుంచి కూలీలతో కలిసి టిప్పర్లో శుక్రవారం వేకువజామున వస్తుండగా చిరుత కనిపించింది. గమనించిన కూలీలు తమ సెల్ఫోన్లలో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు చిత్రీకరించి గ్రామానికి చెందిన గ్రూప్లో పోస్టు చేశారు. దీంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు.
ఆగస్టు 15న ఓ మందపై చిరుత దాడి చేయగా ఒక గొర్రె మృతి చెందింది. మళ్లీ 15 రోజులకు మరోసారి మందపై చిరుత దాడి చేయగా.. రెండు గొర్రెలు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయం నుంచి బయట పడ్డాయి. ఈ విషయాన్ని గొర్రెల కాపర్లు అటవీశాఖ అధికారులకు చెప్పినా పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. చిరుత దాడిలో ప్రాణం పోతే గాని స్పందించరా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా గ్రామశివారులో బోను ఏర్పాటు చేసి చిరుతను బంధించాలని గ్రామస్తులు కోరుతున్నారు.