జనగామ చౌరస్తా, డిసెంబర్ 19: చాకలి ఐలమ్మ జిల్లా మహిళా సమాఖ్యలో నిధుల గోల్‌మాల్‌పై 32 మందిపై చీటింగ్ కేసు నమోదైంది. జనగామ మండలంలోని వెంకిర్యాల గ్రామంలో ఆగస్టు 24వ తేదీన నాలుగెకరాల భూమిని రూ.2.35 కోట్లతో మార్కెట్ రేటు కన్నా అధిక ధరకు కొనుగోలు చేసి అవకతవకలకు పాల్పడిన విషయాన్ని ‘నమస్తే తెలంగాణ’ అక్టోబర్ 25వ తేదీన వెలుగులోకి తెచ్చింది. దీంతో స్పందించిన కలెక్టర్ షేక్ రి జ్వాన్ బాషా సమగ్ర విచారణ జరిపించి బాధ్యుల నుంచి రెండు విడతల్లో రూ.48 లక్షలు రికవరీ చేయించారు.
సెర్ప్ అదనపు డీఆర్డీవో బోనగిరి శ్రీనివాస్‌తో పాటు డీపీ ఎం (ఐబీ అండ్ బీఎల్) దాసరి సమ్మక్కను సస్పెండ్ చేశా రు. అనంతరం నిధుల గోల్‌మాల్‌కు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డీఆర్డీవో వసంతను కలెక్టర్ ఆదేశించడంతో జనగామ అర్బన్ పీఎస్‌లో ఇటీవల ఫిర్యాదు చేసింది. గురువారం జిల్లా సమా ఖ్య అధ్యక్షురాలు సుధ, కార్యదర్శి స్రవంతి, కో శాధికారి చైతన్య, అకౌంటెంట్ మహేశ్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కందగట్ల అశోక్, కీర్తి లక్ష్మినర్సయ్య, వీరేందర్తో పాటు బాధ్యులైన మరో 25 మందిపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసినట్లు ఏసీపీ పార్థసారథి ఒక ప్రకటన విడుదల చేశారు.
మరికొంతమందిపై కేసు నమోదు చేసే అవకాశం ఉందన్నారు. నిధుల అవకతవకలపై ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన వరుస వార్త కథనాలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మహిళా సమాఖ్యల్లో సంచలనం కలిగించాయి. ప్రస్తుతం చాకలి ఐలమ్మ జిల్లా సమాఖ్యలో 1,26,922 మంది సభ్యులు వాటాదారులుగా ఉన్నారు. వీరికి సంబంధించిన రూ.2.35 కోట్లు పక్కదారి పట్టిన విషయాన్ని ఆధారాలతో సహా బయటపెట్టిన ‘నమస్తే తెలంగాణ’కు మహిళా సంఘాల సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.