నిజామాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై మరోసారి హడావుడి కనిపిస్తున్నది. ఆదివారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మంత్రిగా ప్రమాణం చేసే వారెవరనే దానిపై స్పష్టం లేదు. ఏఐసీసీ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించినప్పటికీ రేవంత్ రెడ్డి క్యాబినెట్లో చోటు దక్కించుకుంటున్నది ఎవరు? అనేది తేలడం లేదు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు.
వీరిలో సీనియర్ ఎమ్మెల్యేగా సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమంటూ రోజంతా ఊహాగానాలు వినిపిస్తున్నా అధికారికంగా వివరాలు వెల్లడి కాలేదు. ఇప్పటికే పలుమార్లు ప్రయత్నాలు చేసి విఫలం కావడం, మంత్రి వర్గ విస్తరణ అనేక సార్లు వాయిదా పడడంతో ఏఐసీసీ పెద్దల ఆశీర్వాదం ఎవరికి లభించిందన్న విషయాన్ని ఎవరూ బయటికి చెప్పడంలేదు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో వివిధ వర్గాల ఎమ్మెల్యేలు భారీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తుండడంతో ఉత్కంఠ కొనసాగుతోంది. సుదర్శన్‌రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి గట్టిగానే పట్టుబడుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. చివరి దాకా రాజ్‌భవన్ మెట్లు ఎక్కి ప్రమాణం
చేసేది ఎవరు అన్నది మరికొద్ది గంటల్లో తేలనున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 18నెలలు అవుతున్నా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి మంత్రి యోగం ఎవరికీ దక్కలేదు. మంత్రివర్గ విస్తరణపై పలుమార్లు లీకులు ఇచ్చి ఇదిగో అదిగో అంటూ ప్రచారం చేశారు. కానీ సామాజిక సమీకరణాలతోపాటు గ్రూపు తగాదాల నేపథ్యంలో అనేక సార్లు క్యాబినెట్ కూర్పు వాయిదా పడుతూ వస్తోంది. ఈసారి ఏఐసీసీ నుంచి అనుమతి లభించడంతో మంత్రి యోగం ముగ్గురు లేదా నలుగురికి దక్కనున్నదని జోరుగా ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుతం రేవంత్ టీమ్‌లో ఆరు మంత్రి పదవులను భర్తీ చేయాల్సి ఉంది.
ఇందులో సామాజిక వర్గాల వారీగా ప్రాధాన్యం ఇస్తూ మంత్రి వర్గాన్ని భర్తీచేయాలని చూస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇప్పటికే చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం అదే సామాజిక వర్గం నుంచి బోధన్ ఎమ్మెల్యే పోటీ పడుతున్నారు. ఈయనకు పోటీగా మల్రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుండడం బోధన్ ఎమ్మెల్యేకు కాసింత ఇబ్బందిగా మారింది. ఈ పరిస్థితుల కారణంగానే బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతల్లో ఎలాంటి సంతోషం కనిపించడం లేదు. ఆదివారం ప్రమాణ స్వీకారం జరిగేంత వరకు ఎలాంటి హడావుడి చేయొద్దన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. చివరి క్షణం దాకా కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి మార్పులైనా జరిగే వీలుండడంతో కాంగ్రెస్ నేతలంతా మౌనంగానే ఉన్నారు.
ముగ్గురు ఓసీ, ఒకరు ఎస్సీ
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, మదన్ మోహన్ రావు ముగ్గురు ఓసీలు ఉన్నారు. జుక్కల్ ఎమ్మెల్యే ఒక్కరే ఎస్సీ వర్గానికి చెందిన వారున్నారు. బీసీలెవరూ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా లేరు. బీసీ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్సీగా ఉన్న బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ ప్రస్తుతం పీసీసీ చీఫ్‌గా కొనసాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో క్యాబినెట్లో ఈయనకు చోటు దక్కడం కష్టమే. మొదట్లో మంత్రి పదవి విస్తరణలో మహేశ్‌కుమార్ గౌడ్ పేరు బలంగా వినిపించింది.
కానిప్పుడు పార్టీ పదవి దక్కడంతో మంత్రి పదవి రేసులో పీసీసీ చీఫ్ వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఎస్సీలకు ప్రాతినిధ్యం కల్పిస్తే తనకు చోటివ్వాలంటూ మొదటి సారి ఎన్నికల్లో గెలిచిన జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ప్రయత్నాలు చేసి మిన్నకుండిపోయారు. తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలుపొందిన మదన్ మోహన్ రావు, భూపతి రెడ్డి సైతం తమకున్న పరిచయాలతో ఏఐసీసీ స్థాయిలో పైరవీలు చేశారు. మంత్రి వర్గంలో చోటు దక్కడం మాత్రం వీరికి కష్టంగా మారింది. ఉమ్మడి జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో కొన్నిగంటలపాటు వేచి చూడాల్సిన పరిస్థితి
ఏర్పడింది.