Chalo Armor | శక్కర్ నగర్ : గ్రామాల్లో కులవృత్తులపై వేటు వేసే విధంగా గ్రామ అభివృద్ధి కమిటీలు చేస్తున్న దౌర్జన్యాలకు నిరసనగా ఈనెల 29న చలో ఆర్మూర్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు దేగాం యాద గౌడ్ అన్నారు. బోధన్ పట్టణంలోని పీఆర్ టీయూ భవనంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
గ్రామ అభివృద్ధి కమిటీల దౌర్జన్యాలు రోజురోజుకు మితిమీరుతున్నాయని, రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా గ్రామీణ ప్రాంతంలో కులవృత్తులపై ఆంక్షలు విధిస్తూ వాటిని అమలు చేయకపోవడంతో, సదరు వృత్తులను నిషేధించి, కులస్తులపై బహిష్కరణల పేరుతో, జరిమానాల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన వాపోయారు.
ఇందులో భాగంగానే కులవృత్తుల పరిరక్షణకు వీడీసీల దౌర్జన్యాలను నిరసిస్తూ ఈ నెల 29న చలో ఆర్మూర్ కార్యక్రమం తలపెట్టినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి బోధన్ పట్టణంలోని అన్ని కుల సంఘాల పెద్దలు సహకరించి ఆర్మూర్ కు తరలిరావాలని ఆయన కోరారు.