వినాయక నగర్, జూన్ 03: నిజామాబాద్ (Nizamabad) జిల్లా కేంద్రంలో మంగళవారం ఉదయం చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 300 క్వార్టర్స్ ఏరియా గోశాల ముందు గల సావిత్రి అనే మహిళ మెడలో నుంచి దుండగులు పుస్తెలతాడు తెంచుకొని పరారయ్యారు. మంగళవారం ఉదయం సావిత్రి తన ఇంటి ముందు వాకిలి ఊడుస్తున్నది. అదేసమయంలో పల్సర్ బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలో నుంచి రెండున్నర తులాల బంగారు పుస్తెలతాడు తెంచుకొని పరారయ్యారు. బాధితురాలు గట్టిగా అరిచినప్పటికీ దుండగులు ఎవరికి చిక్కకుండా పరారయ్యారు.
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దుండగుల కోసం గాలింపు చేపట్టినట్టు ఐదో టౌన్ ఎస్ఐ గంగాధర్ తెలిపారు. పల్సర్ బైక్పై వచ్చిన దుండగులలో ఒకరు ఎరుపు రంగు, మరొకరు తెలుపు రంగు అంగీలు ధరించినట్లుగా పోలీసులకు ఆనవాళ్లు లభించాయి. అంతేకాకుండా దుండగులు గుర్తుపట్టకుండా టోపీలు ధరించారు.