Nizamabad | శక్కర్ నగర్ : నిజామాబాద్ జిల్లా పోలీసుల తీరుపై హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం బోధన్ లో పలువురు సంబురాలు చేసుకున్నారు. కానిస్టేబుల్ ప్రమోద్ ను హత్య చేసి పరారైన నిందితుడు రియాజ్ ని పట్టుకుని ఎన్ కౌంటర్ చేయడం సరైందేనని యువకులు పేర్కొంటున్నారు.
కానిస్టేబుల్ హత్యతోపాటు మరో వ్యక్తి ఆసీఫ్ పై దాడి చేయడం శోచనీయమన్నారు. పరారైన నిందితుడిని పట్టుకునే క్రమంలో మరో వ్యక్తిపై దాడి చేసి.. దవాఖనా లో చికిత్స పొందుతూ మరో మారు పారిపోయేందుకు యత్నించి మరో కానిస్టేబుల్ పై దాడికి పాల్పడం దారుణమన్నారు. ఇలాంటి సంఘటనలో నిందితుడిని ఎన్కౌంటర్ చేసిన పోలీసుల తీరు హర్షణీయమని అన్నారు.
రౌడీ షీటర్లకు ఇది సరైన గుణపాఠమని, భవిష్యత్లో ఇలాంటి సంఘటనలు జరపాలంటే భయపడాల్సిన పరిస్థితి ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ద్యాకం గల్లీ చౌరాస్తాలో బాణాసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో పసులేటి గోపికిషన్, యువకులు పాల్గొన్నారు.