నిజామాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కుల గణన లెక్కలపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. జనాభాను తగ్గించి చూపడంపై నాయక్‌పోడ్(షెడ్యూల్ ట్రైబ్) సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమ జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుకుంటోందంటూ మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జీవనం సాగిస్తోన్న నాయకపోడులను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ కాంగ్రెస్ సర్కారుపై తిరగబడుతున్నారు. 1949లో షెడ్యూల్ తెగ జాబితాలో 9 తెగలను గుర్తించారు. అందులో నాయకపోడు ఒకటిగా ఉంది. కానీ ఆ తర్వాత షెడ్యూల్ తెగల జాబితాలో ఆంద్ అనే తెగను చేర్చి అప్పటి వరకు ప్రత్యేక సీరియల్ నెంబర్ ఉన్న నాయక్‌పోడ్ తెగను గోండ్ తెగకు ఉప తెగగా చూపించడం మొదలు పెట్టారు.
షెడ్యూల్ ట్రైబ్ జాబితాలో సీరియల్ నెంబర్ 6 కేటాయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కుల గణన సర్వేలోనూ సీరియల్ నెంబర్ 6లోనే చూపెట్టారు. ఫలితంగా నాయక్‌పోడ్ జాతి అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడింది. గోండు జనాభాలోనే నాయక్‌పోడ్ జనాభాను కలిపేయడంతో వారి ఉనికికే ప్రశ్నార్ధకం అవుతోంది. తెలంగాణ రాష్ట్రంలో నాయక్‌పోడ్ జనాభా 6లక్షలు పైచిలుకు ఉన్నారు. కానీ కులగణన సర్వేలో గోండు తెగతో కలిపి 3లక్షలే చూపించారు. అందులో నాయక్పోడ్ను అత్యంత తక్కువగా పేర్కొనడంపై ఆదివాసి నాయక్‌పోడ్ సేవా సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. లక్షల్లో ఉన్న నాయకపోడులను వేలల్లో చూపించడంతో పోరాటానికి సిద్ధం అవుతున్నారు.
నాయక్‌పోడ్ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు అనేకం. విద్యారంగంలో డ్రాప్ ఔట్ రేటు ఎక్కువగా ఉండటం, ఉపాధి అవకాశాలు తక్కువ కావడం, భూమి హక్కులు సరిగా అందకపోవడం, ఆరోగ్య సేవలు, మౌలిక సదుపాయాలు లోపించడం వంటివి ప్రధానం. ఎస్టీ సర్టిఫికేట్లు జారీ చేయడంలో ఏరియా ఆధారంగా వివక్ష చూపడం వల్ల చాలా కుటుంబాలు ప్రభుత్వ పథకాల నుంచి మినహాయించబడుతున్నాయి.
ఇలాం టి సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది. కులగణన ద్వారా తమ జనాభాను తక్కువ చూపించడం సామాజిక న్యాయానికి వ్యతిరేకమని నాయకపోడు సంఘం చెబుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన ఈ సర్వేలో సంప్రదాయాలు, సాంస్కృతిక వైవిధ్యాలను సరిగా అధ్యయనం చేయకుండా, హడావిడిగా డేటా సేకరించడం వల్ల ఇలాంటి తప్పులు జరిగాయని నాయక్‌పోడ్ సమాజం ఆరోపిస్తోంది. సమాజ నాయకులు, సంఘాలు ముందస్తుగానే సూచించినప్పటికీ ప్రభుత్వం వాటిని పట్టించుకోకపోవడం ప్రజల ప్రయోజనాలను విస్మరించింది.
నాయకపోడు కులస్థలు తమ స్వతంత్ర గుర్తింపు, సరైన జనాభా లెక్కలు, విద్యా ఉపాధిలో రిజర్వేషన్లు, భూమి పంపిణీ, సమగ్ర అభివృద్ధి పథకాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యలను తక్షణం పరిష్కరించకపోతే సమాజం మరింత వెనుకబాటుకు గురవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కులగణన లక్ష్యం సామాజిక న్యాయం కావాలంటే ప్రభ్తువం నాయక్‌పోడ్ సమాజం చేస్తోన్న ఆందోళనలను గుర్తించి సరైన సవరణలు చేపట్టాలని కోరుతున్నారు. ఇలాంటి తప్పులు సరిదిద్దకపోతే తెలంగాణలో ఆదివాసి సమాజాల అభివృద్ధి కేవలం కాగితాల మీద మాత్రమే మిగిలి పోయే ప్రమాదం ఏర్పడుతుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుల సర్వేపై తెలంగాణ రాష్ట్రంలో నాయక్‌పోడ్ సమాజం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ సమాజం తమను గోండు తెగతో కలిపి లెక్కించడాన్ని తప్పు పడుతూ తమ స్వతంత్ర గుర్తింపును కాపాడుకోవాలనే డిమాండ్‌తో ఆందోళనకు బాట పడుతున్నారు. కుల గణనలో తమ జనాభా సరిగా ప్రతిబింబించకపోవడంతో సామాజిక, ఆర్థిక ప్రయోజనాలు కోల్పోతున్నామని ఆందోళన చెందుతున్నారు. నాయకపోడు సమాజం తెలంగాణలోని ఆదివాసి సంప్రదాయాలు, సంస్కృతి, భాషా లక్షణాలు కలిగిన ప్రత్యేక కులం.
చారిత్రకంగా గోండు, రాజ్ గోండ్లతో కలిసి షెడ్యూల్ ట్రైబ్(ఎస్టీ) జాబితాలో ఉంది. ఈ కులం స్వతం త్ర గుర్తింపు కోసం దశాబ్ధాలుగా పోరాడుతోంది. 1976లో ఏర్పడిన ఎస్టీ జాబితా సవరణలో కూడా ఈ సమాజం ప్రత్యేకంగా గుర్తించబడినప్పటికీ ఇప్పుడు కుల గణనలో గోండు తెగలో కలిపేసి జనాభా లెక్కలను తగ్గించడం ప్రమాదాన్ని తెచ్చి పెడుతోందని నాయక్‌పోడ్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సర్కారు తీసుకుంటున్న ఈ చర్యల వల్ల మరింత వెనుకబాటుకు నెట్టివేసే విధంగా మారిందని వాదిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టబోతున్న జనగణన, కులగణనలో ఆదివాసీ నాయక్‌పోడ్ తెగకు ప్రత్యేక కాలం కేటాయించి అందులో జనాభా వివరాలు ప్రత్యేకంగా పొందుపర్చాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.