మోర్తాడ్, జనవరి 27 : ఎన్నో ఔషధ గుణాలున్న పసుపును పండించడంలో నిజామాబాద్ జిల్లా ప్రథమస్థానంలో ఉన్నది. ప్రతిఇంటా నిత్యం వినియోగించే పసుపునకు ఏటా మంచి డిమాండ్ ఉంటుంది. కానీ ఎన్నో ఆశలతో కష్టపడి పంటను పండించిన రైతులకు మార్కెట్లో విక్రయించేప్పు డు ఒక్కోసారి గిట్టుబాటు ధర లేక దిగులుపడా ల్సి వస్తుంది. ఈ ఏడాది పసుపు పంట ధర గతం లో ఎన్నడూ లేనంతగా పతనమైంది. పంట నాణ్యతలో రాజీపడకుండా జాగ్రత్తలు పాటిస్తే బంగారం లాంటి రేటు వస్తుంది. కోత పూర్తిచేసిన నాటి నుంచి మార్కెట్‌కు తరలించే వరకు కాపాడుకోవాలి. గిట్టుబాటు ధర రావాలంటే పంట నాణ్యత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఉద్యానశాఖ అధికారి సుమన్ పలు సూచనలు చేశారు.
పసుపు తవ్వకం పద్ధతులు..
పసుపును విత్తిన 7-9 నెలల్లో వివిధ రకాల గుణగణాల ఆధారంగా జవనరి నుంచి మార్చి వరకు కోతకు వస్తుంది. స్వల్పకాలిక రకాలు 7-8 నెల లు, మధ్యకాలిక రకాలు 8-9 నెలలు, దీర్ఘకాలిక రకాలు 9 నెలల్లో కోతకు వస్తాయి. విత్తన రకాలతోపాటు భూమిలో లభ్యమయ్యే పోషకాలు, నీటిలభ్యతపై కూడా కోతకు వచ్చే సమయం ఆధారపడి ఉంటుంది. పంట కోతకు వచ్చినపుడు ఆకులు పసుపురంగుకు మారడం, ఒకవైపునకు వాలిపోవడం, కొనలు ఎండిపోవడం వంటి మార్పులు గమనిస్తాం. మన రాష్ట్రంలో ఆకులను ముందుగా కోస్తారు. అనంతరం నీరుపెట్టిన రెండుమూడు రోజులకు పసుపు దుంపలను తవ్వితీస్తారు.
కొక్కేలతో తవ్వడం..
కోతకు వచ్చిన పంటకు నీరు అందించి భూమి మెత్తబడితన తర్వాత కొక్కేలతో తవ్వి దుంపలను బయటికి తీస్తారు. ఈవిధానం ద్వారా పదిశాతం వరకు దుంపలు గాయపడి నాణ్యత కోల్పోయే ప్ర మాదం ఉంటుంది. మరో పదిశాతం కన్నా ఎక్కువ దుంపలు భూమిలో ఉండే అవకాశం ఉంది. ఎకరా పసుపు తవ్వడానికి 6-8 మంది కూలీలు అవసరమవుతారు. తవ్వే సమయంలో దుంపలను జాగ్రత్తగా బయటికి తీయాల్సి ఉంటుంది. నాగలితో దున్నితే ఎక్కువ శాతం దుంపలు దెబ్బతినడం లేదా భూమిలోనే మిగిలిపోవడం జరుగుతుంది. ఈవిధానం ద్వారా ఖర్చుభారం పెరగడంతోపాటు పంట నాణ్యత కూడా దెబ్బతింటుంది.
పవర్‌టిల్లర్ లేదా ట్రాక్టర్‌తో తవ్వడం..
పవర్ టిల్లర్ లేదా ట్రాక్టర్‌కు హార్వెస్టర్‌ను అమర్చి పసుపు దుంపలను తవ్వొచ్చు. ఈవిధానంతో దుంపలకు గాయాల శాతం 1-2 శాతం మాత్రమే ఉంటుంది. ఈ విధానంలో ఒక్కరే అవలీలగా తవ్వుకోవచ్చు. భూమిలో మిగిలిపోయే దుంపల శాతం కూడా తక్కువే.
పసుపు దుంపల శుభ్రత..
భూమినుంచి బయటికి తీసిప దుంపలను శుభ్రం చేసుకోవాలి. తల్లి దుంపలను, పిల్ల కొమ్ములను వేరు చేసుకోవాలి. గాయపడిన దుంపలను వేరు చేసుకోవాలి. దుంపలకు కలిగిన వేర్లను కొడవలితో తీసేయాలి. దుంపలు తవ్విన వారం రోజుల్లో ఉడకబెట్టాలి.
పసుపును ఉడికించడంతో పద్ధతులు:
పసుపు దుంపలను ఉడికించడానికి కడాయిలను ఉపయోగిస్తారు. ఈ పద్ధతిలో 45-60 నిమిషాల వరకు తెల్లటి నురుగ పొంగులు, వాసన పొగలు వచ్చే వరకు ఉడికించాలి. ఎక్కువ లేదా తక్కువ ఉడికిస్తే కొమ్ము రంగు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్తపడాలి.
ఆవిరి యంత్రం ద్వారా:
ఆవిరి యంత్రం సహాయంతో దుంపలను ఉడికిస్తే నాణ్యతను కాపాడుకోవచ్చు. ఈ పద్ధతిలో రోజుకు సుమారు 150 క్వింటాళ్ల వరకు ఉడకబెట్టవచ్చు. నాలుగు డ్రమ్ముల్లో రెండు విడుతలుగా ఆవిరికి 40 నిమిషాల సమయంలో పసుపును ఉడకబెట్టవచ్చు. ఈ ప్రక్రియలో బురదనీరు, ఉప్పునీరు, సున్నపునీరు ఉపయోగించొద్దు. లేదంటే పసుపు దెబ్బతినే అవకాశం ఉంటుంది.
ఆరబెట్టడంలో జాగ్రత్తలు..
ఉడకబెట్టిన పసుపును శుభ్రమైన నేలపై లేదా సిమెంట్ ప్లాట్‌ఫాంపై కుప్పులుగా పోయాలి. 24 గంటల తరువాత రెండు లేదా మూడు అంగుళాల మందంగా పరచాలి. 10-15 రోజుల్లో పసుపు కొమ్ములన్నీ ఒకే మాదిరిగా కనిపిస్తాయి. ఎండిన కొమ్ములను విరిస్తే శబ్ధం వచ్చే వరకు ఆరబెట్టాలి. దుంపలో కనీసం 8-10 శాతం వరకు తేమ కలిగి ఉండే విధంగా చూసుకోవాలి. ఉడికిన పసుపు మరోసారి తడవకుండా జాగ్రత్తపడాలి. లేదంటే నారింజ రంగుకు మారుతుంది.
పాలిషింగ్..
ఎండిన పసుపు కొమ్ములు గరుకుగా పొలుసులతో వేర్లు కలిగి ఉంటాయి. వాటిని పాలిషింగ్ చేసి ఆకర్షణీయంగా తయారు చేసుకోవాలి. పాలిషింగ్ డ్రమ్ముల్లో పసుపుకొమ్ములను వేసి తిప్పుతున్నపుడు పసుపు కలిపిన నీళ్లను చల్లితే మంచి రంగుతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
మార్కెట్‌కు తరలింపులో జాగ్రత్తలు..
మార్కెట్లో దుంపల సైజు, రంగు, తేమ ఆధారంగా గ్రేడింగ్ చేస్తారు. మంచి ధర రావాలంటే పై జాగ్రత్తలతో నాణ్యతను కాపాడుకోవడంతోపాటు మార్కెట్‌కు తరలించే పసుపు మంచి రంగుతో తక్కువ తేమ ఉండేలా చూసుకోవాలి. గోనే సంచుల్లో నింపేటప్పుడు మట్టి, ఇతర చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలి. పంట రంగు మారకుండా శుభ్రమైన సంచులను వాడడం మంచిది.