కామారెడ్డి, ఏప్రిల్ 18 : కామారెడ్డి మం డలం శాబ్దిపూర్ గ్రామంలో తూకంలో మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ రైతులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. శాబ్దిపూర్ గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో బస్తాకు రెండు కిలోల ధాన్యం ఎక్కువగా తూకం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఆరుగాలం కష్టపడి ధాన్యాన్ని పండిస్తే అధికారులు తమ పొట్టకొడుతున్నారని ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న సొసైటీ అధికారులు కొనుగోలు కేంద్రానికి వచ్చి కాంటా చేసే యంత్రాన్ని సరిచేస్తామని చెప్పడంతో రైతు లు శాంతించారు. ఈ విషయమై ఇన్చార్జి కార్యదర్శి సతీశ్‌తో ఫోన్లో మాట్లాడగా కాంటా మిషన్‌లో సాంకేతిక లోపంతో రెండు కిలోలు ఎక్కువగా చూపించినట్లు తెలిపారు. కాంటా ప్రకారం మళ్లీ రెండు కిలోల లెక్కచేసి తిరిగి ఇచ్చినట్లు పేర్కొన్నారు.