డిచ్పల్లి, మార్చి 12: తెలంగాణ యూనివర్సిటీ పేరును మార్చనున్నారనే ప్రచారం ఉమ్మడి జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. మన ఆత్మగౌరవానికి, అస్తిత్వానికి ప్రతీక అయిన ‘తెలంగాణ’ను మార్చాలన్న ప్రతిపాదనలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఇప్పటికే విద్యార్థి లోకం భగ్గుమంటున్నది. విద్యార్థి సంఘాలు ఆందోళన బాట పట్టాయి. రెండ్రోజులుగా యూనివర్సిటీలో నిరసనలు, ధర్నా లు చేపట్టాయి. బీఆర్ఎస్వీ, ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ, బీసీ విద్యార్థి సం ఘం పోరాటాలకు సిద్ధమవుతున్నాయి. ఈశ్వరీబాయ్ యూనివర్సిటీగా మార్చాలన్న ప్రతిపాదనలు వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేకపోతే ఉద్యమం లేవదీస్తామని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాయి.
యూనివర్సిటీ కోసం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గతంలో అనేక పోరాటాలు జరిగాయి. వర్సిటీ సాధన పోరులో అనేక మంది విద్యార్థి నేతలు జైళ్లకు వెళ్లారు. లాఠీదెబ్బలు తిన్నారు. అయినప్పటికీ ఎక్కడా వెనక్కు తగ్గలేదు. దీంతో దిగివచ్చిన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వర్సిటీ ఏర్పాటుకు ముందుకొచ్చింది. అలా 2006లో నిజామాబాద్ గడ్డ మీద తెలంగాణ యూనివర్సిటీ పురుడు పోసుకున్నది. అప్పటికే స్వరాష్ట్ర కాంక్షతో ఉద్యమం జోరుగా సాగుతున్న రోజులవి. పక్కా సమైక్య వాది అయిన వైఎస్ రాజశేఖరరెడ్డి తెలంగాణ పేరిట యూనివర్సిటీని ప్రా రంభించారు. అలాంటిది స్వరాష్ట్ర కల సాకారమై దశాబ్ద కాలం గడిచిన తర్వాత ఇప్పుడు రేవంత్ సర్కారు ఇప్పుడు ‘తెలంగాణ’ అస్తిత్వమే లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నది. తెలంగాణ యూనివర్సిటీని ఈశ్వరీబాయి విశ్వవిద్యాలయంగా మార్చే కుట్రకు తెర లేపుతున్నది.
తెలంగాణ యూనివర్సిటీ పేరు మార్చేందుకు కాంగ్రెస్ సర్కారు యత్నిస్తుండడంపై విద్యార్థి, ఉద్యమ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఎన్నో త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ యూనివర్సిటీకి ఈశ్వరీబాయ్ పేరు పెట్టాలని ప్రతిపాదిస్తుండడంపై మండిపడుతున్నాయి. ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ల తల్లిదండ్రుల పేర్లు ప్రభుత్వ సంస్థలకు పెట్టుకోవడం పద్ధతి కాదని విమర్శిస్తున్నాయి. రేవంత్ ప్రభుత్వం తక్షణమే ఆ ప్రయత్నాలను విరమించుకోవాలని, లేకపోతే ఉద్యమం తప్పదని బీఆర్ఎస్వీ, ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ తదితర సంఘాలు హెచ్చరిస్తున్నాయి. తెలంగాణ యూనివర్సిటీ పేరు మార్చడమంటే రాష్ర్టాన్ని అవమానించడమేనని ఉద్యమ సంఘాలు పేర్కొంటున్నాయి. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బ కొట్టేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడితే పోరాటాలు తప్పవని స్పష్టం చేస్తున్నాయి.
త్యాగాలకు ప్రతీకగా భావించే ‘తెలంగాణ’ను కాదని యూనివర్సిటీకి మరోపేరు పెడతామంటే ఊరుకునేది లేదని ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడు అమృత్చారి అన్నారు. వర్సిటీ పేరు మార్పుపై వచ్చిన నివేదికను ప్రభుత్వం తిరస్కరించాలన్నారు. పేరు మార్పుపై దృష్టి పెట్టడానికి బదులు వర్సిటీలో నెలకొన్న సమస్యల పరిష్కారంపై పెట్టాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ స్థానంలో కాంగ్రెస్ నాయకురాలు ఈశ్వరీబాయి పేరును వర్సిటీకి పెట్టాలని ప్రతిపాదించడం దురదృష్టకరమన్నారు. ఆ ప్రయత్నాలను మానుకోవాలని, లేకపోతే ఉద్య మం తప్పదని హెచ్చరించారు. రాష్ట్రం పేరుతో ఏర్పడిన ఏకైక వర్సిటీ ఇదేనని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేశ్ అన్నారు. ఎంతో చరిత్ర కలిగిన వర్సిటీ పేరు మార్చడమంటే ఈ రాష్ర్టాన్ని కాంగ్రెస్ ప్రభు త్వం అవమానించడమే అవుతుందన్నారు.
వర్సిటీ పేరు మారిస్తే సీఎం రేవంత్రెడ్డి చరిత్ర హీనుడిగా మిగిలి పోవడం ఖాయమన్నారు. బడ్జెట్లో నిధులు కేటాయించి అభివృద్ధికి కృషి చేయాలి తప్ప పేరు మార్చే అనాలోచిత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. తెలంగాణ అంటే ఉద్యమానికి ప్రతీక అని, అలాంటిది వర్సిటీ పేరు మార్చి ఈశ్వరీబాయి పేరు పెడతామనడం సరికాదని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ అన్నారు. 1960 నుంచి 2014 వరకు సుదీర్ఘ చరిత్ర కలిగిన తెలంగాణ పేరును మార్చడమంటే రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బ తీయడమే అవుతుందన్నారు.