Road Accident | పెద్ద కొడప్ గల్ (జుక్కల్), సెప్టెంబర్ 4 : జాతీయ రహదారి 161పై బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటన జుక్కల్ చౌరస్తా సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో హైదరాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఆంజనేయులు (50) అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ నుంచి బిచ్కుందకు ప్రయాణికులతో వెళ్తున్న బస్సు జుక్కల్ చౌరస్తా సమీపంలోని జాతీయ రహదారి 161పైకి చేరుకోగానే అదుపుతప్పి బోల్తా పడింది.
ప్రమాద తీవ్రతతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులో ఉన్న 15 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో స్థానికులు వెంటనే వారిని బయటకు తీసి పోలీసులకు సమాచారమందించారు. సమాచారం అందుకున్న డీఎస్పీ విట్టల్ రెడ్డి, సీఐ రవికుమార్, ఎస్సై మురళి సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన 15 మంది ప్రయాణికులను చికిత్స నిమిత్తం బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.