ప్రతి పల్లెకూ బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు అధికారులు చెబుతున్నా..ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ‘పల్లె వెలుగు’ కనిపించడంలేదు. దీంతో ఇతర గ్రామాలకు వెళ్లి చదువుకుంటున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొన్ని సందర్భాల్లో నడుచుకుంటూ.. మరికొన్నిసార్లు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తున్నది. కొందరు విద్యార్థులు ఆర్థిక భారంతో చదువు మానేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది.
-పొతంగల్, జూన్ 27
చాలా గ్రామాల్లో ఇప్పటికీ ప్రభు త్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలే ఉన్నాయి. దీంతో హైస్కూల్ చదువుల కోసం విద్యార్థులు సమీపంలోని పెద్ద గ్రామాలు, పట్టణాలకు వెళ్లాల్సి వస్తున్నది. గ్రామీణ ప్రాంతాల నుంచి మండల కేంద్రాలు, పట్టణాలకు చదువుకునేందుకు వెళ్లే విద్యార్థులను రవాణా కష్టాలు వేధిస్తున్నాయి. పొతంగల్ మండలంలోని హంగర్గఫారం, హంగర్గ, కొడి చర్ల, తిర్మలాపూర్, జల్లాపల్లి తదితర గ్రామాల విద్యార్థులు ప్రాథమిక విద్యను తమ గ్రామాల్లో పూర్తి చేసి, మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వెళ్తున్నారు.
బస్సు సౌకర్యం లేకపోవడం, సరైన సమయానికి బస్సు రాకపోవడంతో కొందరు నడిచి వెళ్తుండగా.. మరికొందరు ఆటోల్లో వెళ్తున్నారు. సమయానికి బస్సు వచ్చినా.. అందులో రద్దీ ఎక్కువగా ఉండడంతో విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. ఒక్కో గ్రామం నుంచి సుమారు మూడు, నాలుగు కిలోమీటర్ల మేర నడిచి వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. భుజాన పుస్తకాల బ్యాగులు వేసుకున్న విద్యార్థుల గోస చూసి తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఆర్థికంగా ఉన్న వారు మాత్రం ప్రైవేటు పాఠశాలలకు.. ఆయా స్కూల్ బస్సుల్లో వెళ్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, సమస్యను పరిష్కరించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
మండలంలోని హంగర్గ ఫారం, హంగర్గ, కొడిచర్ల, తిర్మలాపూర్తోపాటు మరికొన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. ఈ గ్రామాల విద్యార్థులు చదువుకునేందుకు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలకు వెళ్లాల్సిందే. ‘పల్లెవెలుగు’ లేకపోవడంతో ప్రైవేటు ఆటోలు, వ్యాన్లను ఆశ్రయిస్తున్నారు. ఒక్కో విద్యార్థికి నెలకు సుమారు వేయి రూపాయల వరకు ఖర్చు అవుతున్నదని తల్లిదండ్రులు వాపోతున్నారు. మరికొన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం ఉన్నా.. అవి సమయానికి రావడం లేదని ఆరోపిస్తున్నారు. విద్యార్థులకు బస్సులో స్థలం ఉండడం లేదని, ఫుట్ బోర్డు ప్రయాణం చేయాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. బస్సుల సంఖ్యను పెంచడంతోపాటు, సమయానికి నడపాలని కోరుతున్నారు.
ఉన్నత విద్య కోసం ఇతర గ్రామాలకు వెళ్లే విద్యార్థులకు నెలకు రూ.600చొప్పున సమగ్ర శిక్ష అభయాన్ నుంచి రవాణా భత్యం ఇప్పించేందుకు ప్రయత్నిస్తాం. కొందరు విద్యార్థులు ఆటోలు, వ్యాన్లలో పాఠశాలకు వస్తున్నారు. రవాణా భత్యం కోసం తల్లిదండ్రుల అభ్యర్థన పత్రంతోపాటు విద్యార్థి ఆధార్, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ జిరాక్స్ జత చేసి పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలి. ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులు ఒకటి నుంచి ఆరు కిలోమీటర్లు, ఆరు, ఏడో తరగతి విద్యార్థులు మూడు కిలోమీటర్లు, 8,9,10 తరగతుల విద్యార్థులు ఐదు కిలోమీటర్ల దూరం వెళ్లి చదువుకుంటే.. రవాణా భత్యం పొందేందుకు అర్హులు.
– శంకర్, మండల విద్యాధికారి, పొతంగల్