కంఠేశ్వర్, జూలై 1 : జిల్లాలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై అధికారులు చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట మంగళవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ నాయకుడు పొద్దుటూరి అభిలాష్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రైవేట్ విద్యాసంస్థలు ఫక్తూ వ్యాపార సంస్థలుగా మారాయని మండిపడ్డారు. జిల్లాలో 99 శాతం ప్రైవేట్ పాఠశాలల్లో అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, పాఠశాలల్లోనే పాఠ్య పుస్తకాలు అమ్ముతున్నారని పేర్కొన్నారు.
నర్సరీ నుంచి రూ.లక్షల్లో ఫీజులు రాబడుతున్నా విద్యాశాఖ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అనుమతులు లేకుండానే కొన్ని ప్రైవేట్ పాఠశాలలు తరగతులు నిర్వహిస్తున్నాయని తెలిపారు. మరికొన్ని తోక పేర్లతో తరగతులు నిర్వహిస్తున్నా డీఈవో మాత్రం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
డీఈవో జిల్లాలో ఇప్పటివరకూ ఎన్ని పాఠశాలలు తనిఖీ చేశారో తెలుపాలని డిమాండ్ చేశారు. జిల్లావ్యాప్తంగా ఎన్ని స్కూళ్లకు అనుమతులు ఉన్నాయి, ఎన్ని స్కూళ్లకు అనుమతులు లేవో డీఈవో కార్యాలయం ఎదుట నోటీస్ బోర్డుపై వివరాలను ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. అనంతరం డీఈవో అశోక్‌ను కలిసి వినతిప త్రం అందజేశారు. బీఆర్ఎస్వీ నాయకులు సుమ న్, బన్నీ, రాజు, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.