నిజామాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తి వేదికగా తెలంగాణ నినాదం మరోసారి మార్మోగింది. బీఆర్ఎస్ పార్టీ 25 వ వసంతంలోకి అడుగిడిన సందర్భంగా నిర్వహించిన రజతోత్సవ సభ విజయవంతమైంది. బీఆర్ఎస్ 25 వసంతాల వేడుకలకు ఉమ్మడి జిల్లా నుంచి గులాబీ సైన్యం రామదండులా తరలివెళ్లింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రత్యేక వాహనాల్లో తరలివెళ్లారు. అంతకుముందు ఊరూ, వాడ తేడా లేకుండా గులాబీ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం కేసీఆర్ ప్రసంగాన్ని స్వయంగా వినేందుకు వరంగల్ బాట పట్టారు.
కిలో మీటర్ల పొడవునా ఎటు చూసినా వాహనాల రద్దీ మధ్య గులాబీ పార్టీ నేతలంతా జోరుగా, హుషారుగా ముందుకు కదిలారు. 2001లో ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి, పదేండ్లు తెలంగాణ రాష్ర్టానికి ప్రగతి బాటలు వేసి, 17 నెలలుగా ప్రతిపక్ష పాత్రలో ప్రజా సమస్యలను ఎలుగెత్తి చూపిన బీఆర్ఎస్ పార్టీ.. 24 ఏండ్లు పూర్తి చేసుకుని 25వ ఏటా సగర్వంగా అడుగు పెట్టింది. ఎల్కతుర్తి సభా వేదికగా చరిత్రలో నిలిచిపోయేలా రజతోత్సవ సభ న భూతో న భవిష్యత్తి అన్నట్లుగా జరిగింది. కేసీఆర్ నాయకత్వంలో పద్నాలుగేండ్లు అలుపెరగని పోరాటం చేసి రాష్ర్టాన్ని సాధించిన బీఆర్ఎస్ పార్టీ.. జనాల నుంచి చెక్కుచెదరని ఆదరాభిమానాలను అందుకున్నది.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాల సమర్పించారు. అనంతరం గులాబీ జెండాను ఆవిష్కరించారు. అక్కడి నుంచి పార్టీ శ్రేణులతో కలిసి ప్రత్యేక వాహనాల్లో ఎల్కతుర్తి సభకు వెళ్లారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్ సైతం కార్యకర్తలతో కలిసి తెలంగాణ తల్లికి ప్రణమిల్లారు. అనంతరంగా జెండా ఆవిష్కరించి శ్రేణులందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పి వరంగల్ సభకు తరలివెళ్లారు. బీఆర్ఎస్ రజతోత్సవ వేళ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుపుకోగా, పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటూ జై కేసీఆర్… జై తెలంగాణ నినాదాలు చేశారు.
దేశంలోనే అతి పెద్ద జాతీయ రహదారిగా గుర్తింపు పొందిన ఎన్హెచ్ 44 గులాబీ శ్రేణులతో కిక్కిరిసింది. గులాబీ సభకు వెళ్తున్న వాహనాలతో రద్దీ ఏర్పడింది. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, పశ్చిమ ఆదిలాబాద్ ప్రాంతంలోని పలు నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలంతా ఇదే తోవలో ఎల్కతుర్తి సభకు వెళ్లారు. ఉదయం నుంచే వాహనాల రద్దీ కనిపించింది. అధినేత ఇచ్చిన మార్గసూచిని ఆధారం చేసుకుని వయా సిద్దిపేట, హుస్నాబాద్ మీదుగా సభాస్థలికి చేరుకున్నారు.
జోన్ 5 పార్కింగ్ ప్రాంతంలోనే వాహనాలను క్రమపద్ధతిలో పార్కింగ్ చేసుకుని ముందుకు కదిలారు. సరైన సమయానికి సభా స్థలికి చేరుకుని కేసీఆర్ను స్వయంగా చూసి ఈలలు వేస్తూ హుషారెత్తించారు. కేసీఆర్ ప్రసంగాన్ని ఆమూలాగ్రం శ్రద్ధగా వినడంతోపాటు గులాబీ బాస్ చెప్పిన సూచనలను మదికి ఎక్కించుకున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దౌర్జాన్యాలపై ప్రజా పోరాటాలకు కేసీఆర్ ప్రసంగం యావత్ గులాబీ పార్టీ నేతల్లో ఉత్తేజాన్ని నింపింది.
ఉద్యమ స్ఫూర్తిని రగిలించింది. కేసీఆర్ టోపీలు, గులాబీ కండువాలు, గులాబీ పార్టీ ప్రచార రథాలు, గులాబీ రంగుల్లో వాహనాలు, గులాబీ పోస్టర్లు, గోడ ప్రతులు, స్టిక్కర్లు ఇలా ఒకటేమిటి మొత్తానికి గులాబీ పార్టీ రజతోత్సవ సంబురం అచ్చంగా పండుగను తలపించింది.స్వరాష్ట్ర సాధనలో ఎదురైన అనుభవం తమకు మళ్లీ ఎదురైందంటూ పలువురు నేతలు చెప్పుకొచ్చారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై ఏర్పడిన అపనమ్మకానికి ఇదంతా నిదర్శనమని పేర్కొన్నారు. ఉద్యమ కాలంలో స్వరాష్ట్ర సాధన కోసం కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ అలుపెరగని పోరాటం చేసిందని, తిరిగి ఇప్పుడు మళ్లీ తెలంగాణ విముక్తి కోసం అదే తీరుగా గులాబీ పార్టీ పోరాటానికి సిద్ధమైందని నేతలంతా కుండ బద్ధలు కొట్టి చెప్పారు.
గులాబీ పార్టీకి అడుగడుగునా ప్రజల నుంచి విశేషమైన మద్దతు లభించింది. 25 వసంతాలను పూర్తి చేసుకున్న భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సభకు ప్రజలు స్వచ్ఛందంగా కదలివచ్చారు. ఇందులో రైతులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో కనిపించారు. కేసీఆర్ మళ్లీ రావాలంటూ రైతన్నలంతా ఆకాంక్షించారు. ఎల్కతుర్తి సభకు వెళ్తున్న క్రమంగా బస్సుల్లో కార్యకర్తలకు దారిపొడవునా ప్రజల నుంచి స్వాగతాలు, అభినందనలు లభించాయి. గులాబీ కండువా కప్పుకున్న కార్యకర్తలను చూసి చాలా మంది పిడికిలి ఎత్తి నినాదాలు చేస్తూ మద్దతు అందించడం దారిపొడవునా కనిపించింది. గ్రామాల్లో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా దర్శనమిచ్చింది.
సభకు వచ్చి వెళ్లే మార్గంలో వాహనాల రాకపోకలపై బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా నిరంతరం పర్యవేక్షించారు. వాట్సాప్ గ్రూపులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని మండల స్థాయి నాయకులకు అందుబాటులో ఉన్నా రు. వాహనాలు ఉదయం 7గంటలకే బయల్దేరిన సమయం నుంచి ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు ఇంటికి చేరుకునే దాకా నిద్ర పోకుం డా సమన్వయం చేశారు. ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి మరింత చొరవ తీసుకున్నారు.
మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్ గుప్తా, షకీల్ అహ్మద్ సైతం నేతలతో సమన్వయం చేసుకుంటూ సభ విజయవంతానికి కృషి చేశారు. పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, ప్రభుత్వ మాజీ విప్ గంప గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, జాజాల సురేందర్ సైతం శ్రేణులకు నిరంతరం మార్గనిర్దేశనం చేశారు. ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడకుండా జాగ్రత్తలు వహించారు. మజ్జిగ, నీళ్ల ప్యాకెట్లు పంపిణీ చేశారు. నిజామాబాద్, కామారెడ్డి వాసుల కోసం సిద్దిపేట పరిసరాల్లో ఫంక్షన్ హాళ్లలో భోజనాలను ఏర్పాట్లు చేశారు.