kamareddy | కామారెడ్డి : వరంగల్ జిల్లా ఎల్కతుర్తి లో ఈనెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ కార్యకర్తలు నాయకులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. తన నివాసంలో రాజంపేట, కామారెడ్డి మండలాల పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కలిసి సభ సన్నాహక సమావేశాన్ని సోమవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంతో పాటు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ఈ సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గాలికి వదిలి కాలయాపన చేస్తున్నారని, హామీల అమలు చేతకాక ప్రతిపక్షాలపై నోరుపారేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచాడని కొనియడారు.
రైతు రుణమాఫీ, రైతుబంధు అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. నియోజకవర్గం నుండి 3000 మంది కార్యకర్తలు తరలించాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీ రజతోత్సవ సభ సందర్భంగా అన్ని గ్రామాల్లో 27న పార్టీ జెండా ఆవిష్కరించి సభకు బయలుదేరాలని సూచించారు. ఈ సమావేశంలో కామారెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గోపి గౌడ్, రాజంపేట మండల అధ్యక్షుడు బలవంతరావు, సింగిల్ విండో చైర్మన్ నల్లవెల్లి అశోక్, వైస్ చైర్మన్ రమేష్, నాయకులు జూకంటి మోహన్ రెడ్డి, గూడెం బాల్రాజ్, కమలాకర్ రావు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.