మాక్లూర్, నవంబర్ 14: కాంగ్రెస్, బీజేపీల నాయకుల మాటలు నమ్మి వారి మాయలో పడొద్దని, ఆపార్టీలకు ఓటు వేస్తే కరెంట్ కట్ అవుతుందని, సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని బీఆర్ఎస్ ఆర్మూర్ నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మండలంలోని సట్లాపూర్ తండా, మదన్‌పల్లి, ఒడ్డెట్‌పల్లి, అమ్రాద్‌తండా, ముత్యంపల్లి, అమ్రాద్ గ్రామాల్లో జీవన్‌రెడ్డి ప్రజాశీర్వాద యాత్ర నిర్వహించారు. ప్రజలు జీవన్‌రెడ్డికి ఘనస్వాగతం పలికి సత్కరించారు. అమ్రాద్ తండా, ముత్యంపల్లి, అమ్రాద్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలంతా వెంట రాగా ఆయన గ్రామమంతా కలియతిరిగి ప్రతిఒక్కరినీ పేరుపేరునా పలకరిస్తూ యోగాక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి మరింత ముందుకు సాగాలంటే మళ్లీ తనను గెలిపించాలని కోరారు. అనంతరం సట్లాపూర్ తండా, మదన్‌పల్లి, వొడ్యాట్పల్లి, అమ్రాద్ తండా, ముత్యంపల్లి, అమ్రాద్ గ్రామాల్లో ప్రజాశీర్వాద సభలో పాల్గొన్నారు. కేసీఆర్ సబ్బండ వర్గాల ఆత్మబంధువు.
‘మా తండాలో మా రాజ్యం’ అన్న నినాదం సాకారం చేసిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. ఆర్మూర్‌ను రెవెన్యూ డివిజన్, ఆర్మూర్‌కు 100 పడకల దవాఖాన, అభివృద్ధి ఉట్టి పడేలా 11 బైపాస్ రోడ్లు, సిద్ధుల గుట్టకు రూ.20కోట్లకు పైగా ఖర్చు పెట్టి ఘాట్ రోడ్డు, ఉమ్మెడ-పంచగూడ బ్రిడ్జి నిర్మాణం, ఆర్మూర్ పట్టణ ప్రతిష్టను చాటేలా అర్బన్ పార్కు తదితర అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. తనను మళ్లీ దీవించాలని, మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆసరా పెన్షన్లు రూ.5 వేలకు, దివ్యాంగుల పింఛన్లు రూ6 వేలకు, రైతు బంధు ఎకరా రూ.10వేల నుంచి రూ.16 వేలకు పెరుగుతాయి. సౌభాగ్యలక్ష్మి పథకంతో మహిళలకు నెలకు రూ.3 వేల భృతి వస్తుందని, రూ.400కే వంటగ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తామని, రూ.5లక్షల చొప్పున కేసీఆర్ బీమా పథకం అమలు చేస్తామని అన్నారు. ఆర్మూర్ ప్రజల ఆశీస్సులు తనకే ఉన్నాయని, హ్యాట్రిక్ విజయంతో సత్తా చూపిస్తానని పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రభాకర్, పార్టీ మండల అధ్యక్షుడు సత్యం, విండో చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, నాయకులు రాజేశ్వర్, రజనీశ్, అశోక్, రంజిత్, శ్రీనివాస్, సర్పంచులు శ్రీసుధ, శంకర్‌గౌడ్, లింగన్న, కిషన్‌నాయక్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఆర్మూర్, నవంబర్14: ఆలూర్ మండల కేంద్రంతో పాటు ఆ మండలంలోని దేగాం, మచ్చర్ల గ్రామాల్లో మంగళవారం ఉదయం ఆర్మూర్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి పర్యటించారు. గ్రామంలోని హోటళ్లు, ప్రధాన కూడళ్లలో ప్రజలతో ముచ్చటించారు. ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ కుశల ప్రశ్నలు వేశారు. వృద్ధులను కలిసి పింఛన్ వస్తుందా.. అని అడిగి తెలుసుకున్నారు. రానున్న రోజుల్లో రూ.5వేలు అందజేస్తామని, కారుగుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఉదయం హోటల్లో ప్రజలను కలిసి వారితో కలిసి టీ తాగుతూ గ్రామంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పనులపై చర్చించారు. రైతులను కలిసి రైతు బంధు పథకంపై చర్చించారు. మచ్చర్ల గ్రామానికి చెందిన ఆర్మూర్ వ్యవసాయ కమిటీ మాజీ చైర్మన్ భోజారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి మాట్లాడారు. ఆయన వెంట ఆర్మూర్ ఎంపీపీ పస్క నర్సయ్య, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సంజయ్సింగ్బబ్లూ ఉన్నారు.
నందిపేట్, నవంబర్ 14: డొంకేశ్వర్ మండలం జీజీనడ్కుడ, అన్నారం, సిర్పూర్ గ్రామాల్లో మంగళవారం ఎమ్మెల్యే అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డి సతీమణి రజితారెడ్డి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలతో పాటు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. కారు గుర్తుకు ఓటు వేసి జీవన్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.