కాంగ్రెస్ పార్టీ రైతుభరోసాపై మీనామేషాలు లెక్కిస్తున్నది. ఈ పథకం అమలుపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. అదే సమయంలో అనుమానాలు, భయాలూ వెంటాడుతున్నాయి. రైతుబంధు తరహాలో పెట్టుబడి సాయం అమలవుతుందా? లేదంటే కొందరికే పెట్టుబడి సాయం అందుతుందా? అనే అంశంపై స్పష్టత కరువైంది. 2023లో యాసంగి సీజన్‌కు కొందరికే, అది కూడా కొద్ది మందికి మాత్రమే నామ మాత్రంగా కేసీఆర్ ప్రవేశ పెట్టిన రైతుబంధు సాయాన్ని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం జమ చేసింది. తర్వాత 2024లో వానకాలం సీజన్‌ను పట్టించుకోలేదు. పైసా పెట్టుబడి సాయం అందలేదు. ప్రస్తుతం యాసంగి సీజన్ అమలవుతున్నప్పటికీ పెట్టుబడి సాయంపై స్పష్టత కరువైంది.
ప్రభుత్వం మాత్రం రైతుభరోసాను త్వరలోనే అమలు చేస్తామంటూ చెబుతోంది. శనివారం శాసనసభలో రైతుభరోసా అమలుపై స్వల్పకాలిక చర్చ జరిగింది. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చర్చను ప్రారంభించగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ తన వైఖరిని కుండబద్దలు కొట్టింది. రైతుల్లో అలుముకున్న అనుమానాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. సాంకేతిక అంశాలతోపాటు శాస్త్రీయమైన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. రైతుభరోసాను అందరికీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. శాసనసభలో రైతుభరోసాపై వాడివేడిగా వాదోపవాదాలు జరిగిన నేపథ్యంలో రైతన్నల్లోనూ భారీగా ఆశలు ఏర్పడ్డాయి. కేసీఆర్ అందించినట్లుగానే రైతులకు ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం కల్పించాలని ప్రతి ఒక్కరూ కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
-నిజామాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
బీఆర్ఎస్ హయాంలో ఒక్క పంట కాలంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారుగా 5లక్షల మంది రైతులకు (రైతుబంధు)పెట్టుబడి సాయం అందేది. ఇలా ఏటా రెండు పంట కాలాల్లో రూ.వెయ్యి కోట్లకు పైగానే రైతుబంధు ద్వారా ఎకరానికి రూ.10వేలు చొప్పున సాయం అందించారు.ఏడాది క్రితం కొలువు దీరిన రేవంత్ రెడ్డి సర్కారు మాత్రం ఠంఛనుగా రైతులకు అందాల్సిన రైతుభరోసాను ఇవ్వకుండా తాత్సారం చేస్తోంది. వానకాలం పంటకు పెట్టుబడి సాయం ఇవ్వకుండానే ఎగవేతకు పాల్పడింది. యాసంగికి రైతుభరోసా అమలు చేస్తామని చెబుతున్నప్పటికీ స్పష్టత కరువైంది. పంటలు పండించే భూములకే సాయం అందిస్తామంటూ సర్కారు ప్రకటించిన నేపథ్యంలో ఎవరెవరికి పెట్టుబడి సాయం అందుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఏ పంటలు సాగు చేస్తే వర్తిస్తుందో తెలియక రైతులు గందరగోళంలో ఉన్నారు. ఉద్యాన పంటల సాగుకు పెట్టుబడి సాయం ఉంటుందా? లేదా అన్నది తేలలేదు. మరోవైపు పామాయిల్ లాంటి దీర్ఘకాలిక పంటలు సాగు చేస్తున్న రైతులకు రైతుభరోసా వస్తుందా రాదా? అనే విషయంపై స్పష్టత కరువైంది. అంకాపూర్ వంటి ప్రాంతాల్లో మూడు పంటలు సాగు చేసే రైతులున్నారు. పంటల ఆధారంగా పెట్టుబడి సాయం ఇస్తే వీరికి మూడు విడుతల్లో రైతుభరోసా వస్తుందా? అని రైతులు అడుగుతున్నారు. పసుపు పంట సాగు చేసే వారికి ఏడాది కాలం గడిచిపోతుంది.
తొమ్మిది నెలల పసుపు పంటను సాగు చేసే వారికి ఏ ప్రాతిపదికన రైతుభరోసా అందిస్తారో తెలియడం లేదంటూ రైతులు వాపోతున్నారు. బీఆర్ఎస్ హయాంలో 2023లో వానకాలం సీజన్లో లక్షలాది మందికి రైతుబంధు సాయం అందింది. నిజామాబాద్ జిల్లాలో 2లక్షల 82వేల మందికి రూ.274 కోట్లు, కామారెడ్డి జిల్లాలో 2లక్షల 90వేల మంది రైతులకు రూ.250కోట్లు పెట్టుబడి సాయం అందజేశారు. రైతుబంధు పథకాన్ని 11 విడుతల్లో విజయవంతంగా అమలు చేసి రైతులను ఆదుకుంటే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రైతుభరోసా పేరుతో రూ.15వేలు ఇస్తామని ఇచ్చిన హామీపై ఇప్పటికీ స్పష్టత రాకపోవడం గమనార్హం.
రుణమాఫీపై మొండి ‘చెయ్యి’
రూ.2లక్షల్లోపు పంట రుణాలను మాఫీ చేస్తామని చెప్పి తీవ్ర అయోమయాన్ని సృష్టించిన రేవంత్ సర్కారు, ఇప్పటి వరకు నాలుగు విడుతల్లో ఈ పథకాన్ని అమలు చేసి కొంత మందిని మాత్రమే రుణవిముక్తులను చేసింది. అనేక మందికి మొండి ‘చెయ్యి’ చూపింది. సాంకేతిక కారణాలను చూపి చాలా మందిని పక్కన పెట్టింది. కుటుంబంలో ఒకరికే రుణమాఫీ అంటూ సగానికి ఎక్కువ మందిని పక్కన పెట్టింది. తాజాగా రైతుభరోసా పథకం అమలులోనూ ఇదే అస్తవ్యస్త విధానం కనిపిస్తుండడంపై కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై రైతులు గుర్రుమంటున్నారు. రైతుభరోసానైనా సమయానికి వస్తుందేమోనని గంపెడాశతో ఎదురు చూస్తే అదీ కూడా పత్తా లేకుండా పోయింది.
బాన్సువాడ, బోధ న్, జుక్కల్ ప్రాంతాల్లో యాసంగి సీజన్‌కు సంబంధించిన నాట్లు మొదలయ్యాయి. ఇం కో వారం, పది రోజుల్లో ఉమ్మడి జిల్లా అంత టా వరి నాట్లు ఊపందుకోనున్నాయి. ఈ దశలోనూ ప్రభుత్వం పెట్టుబడి సాయం చేసేందుకు ముందుకు రాలేదు. గతంలో రైతుబంధు పేరుతో ఏటా ఎకరానికి రూ.10వేలు చొప్పున ఠంఛనుగా అందింది. ఎన్నికల్లో ఏటా రూ.15వేలు ఎకరానికి పెట్టుబడి సాయం అందిస్తామని హస్తం పార్టీ హామీ ఇచ్చింది. ఏడాదికి రెండు పంటలకు ఒక్కో సీజన్‌కు ఎకరానికి రూ.7500 చొప్పున సాయం అందాల్సి ఉండగా ఇప్పటికీ చిల్లిగవ్వ అందలేదు. ఈ మధ్యనే రైతుభరోసా అమలుపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసిన నేపథ్యంలో రైతులంతా ఆశగా ఎదురు చూస్తున్నారు.
రైతు భరోసా వెంటనే విడుదల చేయాలి
బాన్సువాడ, డిసెంబర్ 21: రైతు భరోసా ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చినా ఇప్పటివరకు అమలు చేయకపోవడం బాధాకరం. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు ఇచ్చినట్లు ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఇవ్వాలి. రైతు భరోసా డబ్బులు క్రమం తప్పకుండా రైతుల ఖాతాల్లో వేయాలి. ఇప్పటికే రెండు పంటలకు ఇచ్చే పెట్టుబడి ఇవ్వకపోవడం శోచనీయం. వెంటనే రైతుభరోసా అమలుచేయాలి.
– చాకలి సాయిలు, రైతు, కొల్లూర్
రైతు భరోసా వెంటనే ఇవ్వాలి
బాన్సువాడ రూరల్, డిసెంబర్ 21 : వానకాలం పంటలు పూ ర్తి అయినప్పటికీ ప్రభుత్వం ఇప్పటి వరకు రైతుభరోసా ఇవ్వలేదు. గత ప్రభుత్వం పంటలకు ముందే రైతుబంధు పైసలు బ్యాంకుల్లో వేసేది. వానకాలం పంటలతో పాటు యాసంగి పంటలు సాగు చేస్తున్న. రెండు పంటలకు పెట్టుబడి కింద ప్రభుత్వం ఇవ్వలేదు. ప్రభుత్వం రైతుల మేలు కోరుతూ రెండు పంటలకు రైతు భరోసా ఇచ్చి ఆదుకోవాలి.
-గన్ను నాయక్, రైతు, కొయ్యగుట్ట తండా
కాంగ్రెస్ రైతుల ఉసురుపోసుకుంటున్నది
బాన్సువాడ టౌన్, డిసెంబర్ 21: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఇప్పటివరకు రైతు భరోసా మాటే లేదు. 15 వేల రూపాయల రైతు భరోసా అందిస్తామని చెప్పి రైతుల ఓట్లను దండుకున్నది. అధికారంలోకి వచ్చాక రైతుల ఉసురు పోసుకుంటున్నది. రైతుభరోసా పెంచి అందించే మాట దేవుడెరుగు, ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం కూడా దిక్కులేకుండాపోయింది.
– గణేశ్, రైతు, బాన్సువాడ