నందిపేట్/ఆర్మూర్, అక్టోబర్ 17 : తాము చేసిన అభివృద్ధి.. అమలు చేసిన సంక్షేమ పథకాలే ఎన్నికల అస్ర్తాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ ఎమ్మె ల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. ‘నమస్తే నవనాథపురం’లో భాగంగా మంగళవారం నందిపేట మండలం వెల్మల్, ఆలూర్ మండల కేంద్రంలో ‘ప్రజా ఆశీర్వాద యాత్ర’ నిర్వహించారు. ఇంటింటా తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాయన్నారు. అలాగే వివిధ కులసంఘ భవనాల కోసం ప్రొసీడింగ్ కాపీలు అందజేశామన్నారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఒంటరి మహిళ, వితంతు పింఛన్లు ఇలా చెప్పుకుంటే పోతే అనేక సంక్షేమ పథకాలతో ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుస్తున్నామన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇచ్చింది కేసీఆర్ అని.. తెచ్చింది తాను అన్నారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టో తెలంగాణ భవితకు సోపానమన్నారు.
పెన్షన్లు, రైతుబంధునిధులు పెరగడంతో పాటు సబ్బండవర్గాల సంక్షేమానికి కొత్త పథకాలుఉన్నాయన్నారు. కాం గ్రెస్, బీజేపీ ప్రజాశత్రువులని.. ఆ రెండు పార్టీల కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ను మళ్లీ ఆదరించాలని.. తనను గెలిపించాలని జీవన్‌రెడ్డి కోరారు. కార్యక్రమంలో ఆలూర్ సర్పంచ్ కళ్లెం మోహన్‌రెడ్డి, వైస్ ఎంపీపీ భోజకళా చిన్నారెడ్డి, ఉప సర్పంచ్ తుమ్మజీ శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ లక్ష్మీమల్లేశ్, సొసైటీ చైర్మన్ తంబూర్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ సంతోష్‌రెడ్డి, కళ్లెం భోజారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు , గ్రామస్తులు పాల్గొన్నారు.