సిటీబ్యూరో : రెండేండ్లుగా నగరంలో అనుమతి లేకుండా విచ్చల విడిగా ప్రకటనల బోర్డులు వెలిశాయి. ప్రభుత్వానికి వెళ్లే ఆదాయాన్ని ‘టార్గెట్’ చేసిన ముఖ్యనేత బంధువులు, అనుచరులు అందినంత దండుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ అవుట్ డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ నేతలు ఆందోళనలు ఉధృతం చేశారు. దీంతో నూతన అడ్వర్టయిజ్మెంట్ పాలసీని తీసుకువస్తామని ప్రకటించారు. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో అడ్డగోలుగా వెలుస్తున్న ప్రకటనల బోర్డులకు అడ్డుకట్ట వేస్తూ పారదర్శకమైన ‘కాంప్రహెన్సివ్ అవుట్ డోర్ అడ్వర్టయిజ్మెంట్ పాలసీని ప్రభుత్వం ఆమోదించింది.
అందరినీ దృష్టిలో పెట్టుకుని నూతన పాలసీని రూపొందించామని ప్రకటించిన సర్కారు.. అవుట్ డోర్ అడ్వర్టయిజ్మెంట్ మెంట్ పాలసీ ఫర్ క్యూర్ – 2026 పేరుతో సరికొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు జీవో నంబర్ 84ను జారీ చేశారు. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ప్రకటనల్లో కొత్త నిబంధనలు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ ఈ జీవో బడా ఏజెన్సీలకు లబ్ధి చేకూర్చేలా పాలసీ రూపకల్పన జరిగిందంటూ ఆందోళన వ్యక్తమవుతున్నది.
ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన అవుట్ డోర్ అడ్వర్టయిజ్మెంట్ పాలసీపై హోర్డింగ్ యజమానుల అభ్యంతరాలు, అభిప్రాయాలను తప్పనిసరిగా వినాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సంబంధిత స్టేక్ హోల్డర్లందరికీ తమ వాదనలు వినిపించే అవకాశం కల్పించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేస్తూ డబ్ల్యూపీ నంబరు 5442 ఆఫ్ 2026 కేసులో న్యాయస్థానం ఈ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కానీ సర్కారు తెలంగాణ అవుట్ డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ భాగస్వామ్యం లేకుండానే నూతన పాలసీని తీసుకువచ్చి న్యాయస్థానం ఆదేశాలను దిక్కరించింది. జీవో 68 నిబంధనల ప్రకారం 15 అడుగుల కంటే ఎకువ ఎత్తులో ప్రకటనల బోర్డులు ఉండకూడదన్న గత ప్రభుత్వ నిబంధనలకు తిలోదాకాలిచ్చింది.
60 అడుగులు ఎత్తు ఉండాల్సిన చోట భూమి నుంచి యూనిపోల్ గరిష్ఠ ఎత్తు 80 అడుగులు (24 మీటర్లు) చేసింది. అవుట్ డోర్ మీడియాపై వందలాది ఏజెన్సీలు ఆధారపడగా రూఫ్‌టాప్ హోర్డింగ్‌ల ప్రస్తావన లేదు. ఇప్పటి వరకు విలీనమైన 27 పురపాలికల్లో రూఫ్‌టాప్ హోర్డింగ్‌లతో దాదాపు 35వేల కుటుంబాలు జీవనోపాధి పొందుతుండగా, ఈ జీవో ద్వారా వారి జీవితాలు రోడ్డున పడటం ఖాయంగా కనిపిస్తున్నది. అన్నింటి కంటే మించి సర్కారు పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ పద్ధతిలో 15 ఏండ్ల పాటు ప్రకటన దందా చేసుకునే అవకాశం కల్పించింది. పోటీతత్వం లేకుండా పరస్పర అవగాహనతో మల్టిలెవల్ కారు పార్కింగ్, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు , మెట్రోలను లక్ష్యంగా చేసుకుని బడా ఏజెన్సీలు పెత్తనం చేసుకునేలా కొత్త పాలసీ ఏర్పడింది. అంతేకాకుండా లాలిపాప్స్, హోర్డింగ్‌లు (క్యాండీలివర్/రోడ్డు మధ్యలో ఉన్నవి) ప్రజా భద్రతను ప్రశ్నార్థకం చేయనున్నాయి. ఎల్ఈడీ ప్రకటనలపై న్యాయస్థానంలో కేసు నడుస్తున్నప్పటికీ ఎల్ఈడీ ప్రకటనలకు యథేచ్ఛగా అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇలాంటి వాటిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
డిజిటల్ డిస్ ప్లే బోర్డుల విషయంలో రాత్రి పూట కాంతి కాలుష్యాన్ని తగ్గించేందుకు రాత్రి 11 గంటల తర్వాత డిజిటల్ బోర్డుల లైట్లను ఆపివేయాలి. అలాగే ట్రాఫిక్ జంక్షన్ల వద్ద ఉండే డిజిటల్ బోర్డుల్లో కదిలే బొమ్మలు కాకుండా కేవలం స్థిరంగా ఉండే చిత్రాలనే ప్రదర్శించాలి. ప్రకటనల బోర్డుల నిర్మాణంపై స్ట్రక్చరల్ ఇంజినీర్ల నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకోవడం తప్పనిసరి. గాలి వానలు, భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా పునాదులు ఉండాలి. విద్యుత్ లైన్ల నుంచి కనీసం 200 మీటర్ల సురక్షిత దూరం పాటించాలని మార్గదర్శకాల్లో పేరొన్నారు.
కొత్త పాలసీ ప్రకారం నిబంధనలు ఉల్లంఘించే ఏజెన్సీలపై కఠినంగా వ్యవహరిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రతి బోర్డుపై అనుమతి వివరాలతో కూడిన క్యూఆర్ కోడ్ ఉండాలి. ప్రతి అడ్వరె్టైజ్ మెంట్ ను జియో ట్యాగింగ్ చేయడం ద్వారా రియల్ టైమ్ మానిటరింగ్ చేస్తారు. అనుమతి లేని ప్రకటనలను నోటీసు లేకుండానే తొలగిస్తారు. మొదటిసారి తప్పు చేస్తే వార్షిక ఫీజుకు మూడు రెట్లు జరిమానా విధిస్తారు. రెండోసారి కూడా అదే తప్పు చేస్తే సదరు ఏజెన్సీని బ్లాక్ లిస్ట్ చేస్తారు. నిబంధనలు పాటించాలని ఆదేశాలున్నాయి.
ట్రై కార్పొరేషన్ల పరిధి ప్రాంతాలను వాటి వాణిజ్య ప్రాధాన్యతను బట్టి ప్రభుత్వం నాలుగు జోన్లుగా వర్గీకరించింది. స్పెషల్ (ఎస్) జోన్లో అత్యంత రద్దీ కలిగిన అభివృద్ధి ప్రాంతాలు, ట్రాన్స్ పోర్ట్ కారిడార్లు (ప్రీమియం ఫ్యాక్టర్ 1.25) ఉండగా, రెండో కేటగిరీలో జోన్ ఏగా అభివృద్ధి చెందుతున్న కమర్షియల్ హబ్‌లు. (ప్రీమియం ఫ్యాక్టర్ 1)లుగా నిర్ణయించారు. జోన్ బిలో నివాస, వాణిజ్య ప్రాంతాల సమ్మేళనం (ప్రీమియం ఫ్యాక్టర్ 0.85), జోన్ సిలో కేవలం నివాస ప్రాంతాలు (ప్రీమియం ఫ్యాక్టర్ 0.7)లను ఖరారు చేశారు. జోన్ల వారీగా ప్రకటనల ఫీజును ఖరారు చేస్తారు.
కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలో ప్రకటనల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ‘అడ్వర్టయిజ్మెంట్ రెగ్యులేటరీ కమిటీ (ఏఆర్సీ)’ని నోడల్ అథారిటీగా నియమించింది. పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అధ్యక్షతన పనిచేసే ఈ కమిటీలో మెట్రోపాలిటన్ కమిషనర్ (హెచ్ఎండీఏ), జీహెచ్ఎంసీ కమిషనర్‌తో పాటు ఎంఎంసీ, సీఎంసీ కమిషనర్, ట్రాఫిక్ పోలీసులు, మెట్రో రైలు, పర్యాటక, ఆర్టీసీ ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. ఏ ప్రాంతంలో ఎలాంటి ప్రకటనలు ఉండాలో ఈ కమిటీయే డిజైన్ చేస్తుంది. నగరంలో ఎకడ ప్రకటనలు ఉండాలి? వేటికి అనుమతులు ఇవ్వాలి? అనే అంశాలను ఈ కమిటీయే తేలుస్తుంది.