హైదరాబాద్, మార్చి 6(నమస్తే తెలంగాణ) : తెలంగాణను ఏటీఎంగా మార్చుకున్న దుర్మార్గపు కాంగ్రెస్ సర్కార్.. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా మన రాష్ట్ర ప్రజాధనాన్ని వృథా చేస్తున్నదంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు తీవ్రస్థాయిలో విమర్శలు గు ప్పించారు. ఖజానా ఖాళీ అంటూనే సీఎం రేవంత్.. పక్క రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం పేరిట వందల కోట్లను మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారని శుక్రవారం ఎక్స్ వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని,ఇచ్చి న 420 హామీలను నెరవేరుస్తామని నమ్మించి ప్రజల గొంతుకోసిన కాంగ్రెస్.. కేరళలో మాత్రం కలర్పేజీ యాడ్స్ ఇస్తున్నదంటూ తూర్పారబట్టారు.
ఇంటి గడప నుంచే కాంగ్రెస్ మోసాలు
ప్రతి ఇంటి గడప నుంచే కాంగ్రెస్ మోసాలు మొదలయ్యాయని హరీశ్‌రావు మండిపడ్డారు. విద్యార్థులు మొదలుకొని వృద్ధుల దాకా అన్ని వర్గాలను దగా చేస్తున్నదని ధ్వజమెత్తారు. మహాలక్ష్మి స్కీమ్ కింద నెలాకు రూ.2,500, ఆడబిడ్డల పెండ్లిళ్లకు రూ.లక్షతో పాటు తులం బంగా రం ఇస్తామని మహిళలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. జాబ్ క్యాలెండర్ ద్వారా ఏటా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఊదరగొట్టి.. ఆచరణలో ఉత్త చెయ్యి చూపుతున్నారని విమర్శించారు. సర్కార్ బడుల్లో పిల్లలకు కనీస వసతులు కల్పించడంలో విఫలమైన సీఎం రేవంత్, తన అమెరికా టూర్లు, విమాన ఖర్చులు, విలాసాలకు మాత్రం విద్యాశాఖ ఖాతాల నుంచి కోట్లు మళ్లించుకుంటున్నారని ఆరోపించారు.
కేరళ ప్రజలారా కాంగ్రెస్ ట్రాప్‌లో పడొద్దు..
అబద్ధపు హామీలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. కేరళ ఓటర్లను సైతం నమ్మించేందుకు యత్నిస్తున్నదని హరీశ్‌రావు ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఆయనలో ఇంకా ఏ మాత్రమైనా నైతికత మిగిలి ఉన్నా తెలంగాణ ప్రజాధనంతో ఇతర రాష్ర్టాల్లో బూటకపు ప్రచారం నిలిపివేయాలని, అబద్ధాల యాడ్స్ కోసం ఖర్చు చేసిన నిధులను కాంగ్రెస్ ఖాతా నుంచి ప్రభుత్వానికి చెల్లించాలని డిమాండ్ చేశారు.
800 రోజుల్లో కాంగ్రెస్ చేసిందేమిటి?
800 రోజుల కాంగ్రెస్ పాలనలో చేసిందేమీ లేకనే, ఇప్పుడు 99 రోజుల ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి మరో డ్రామాకు తెరతీశాడని హరీశ్‌రావు దుయ్యబట్టారు. పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు తలపెట్టిన యాక్షన్ ప్లాన్ శుద్ధ దండుగ ప్రచారమే తప్ప మరొకటి కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండున్నరేండ్ల తర్వాత కాంగ్రెస్ సర్కార్‌కు ప్రగతి ప్రణాళికలు గుర్తుకొచ్చాయా? అని ప్రశ్నించారు. నోటిఫికేషన్లు ఇవ్వకుండా మూసీ బ్యూటిఫికేషన్ పేరిట లూటీకి తెగబడ్డారంటూ నిప్పులు చెరిగారు. ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందిన కొందరిని చూపిస్తామని గొప్పలు చెబుతున్న మంత్రులు.. అందని గ్యారెంటీల కోసం ఎదురుచూస్తున్న లక్షల మంది బాధితుల సంగతి ఏమిటో చెప్పాలని నిలదీశారు.
రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందంటూ ప్రచారం చేస్తున్న రేవంత్‌రెడ్డి సర్కార్.. తెలంగాణ సొమ్ముతో కేరళలో ఎన్నికల ప్రచార ఆర్భాటం చేస్తున్నది. ఇక్కడ ఆరు గ్యారెంటీల అమల్లో విఫలమైన ప్రభుత్వం అక్కడ మాత్రం ఫుల్‌పేజీ కలర్ యాడ్స్ ఇచ్చి కోట్లాది రూపాయల మన సంపదను దుబారా చేస్తున్నది. – హరీశ్‌రావు