రామారెడ్డి, మే 16: రాష్ర్టాన్ని హరితవనంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా రోడ్లకు ఇరువైపులా, ప్రభుత్వ ఖాళీ స్థలాలు, కార్యాలయాలు తదితర ప్రాంతాల్లో మొక్కలు నాటారు. ప్రతి సంవత్సరం జూన్ నెలలో తొలకరి వర్షాలు కురవగానే మొక్కలు నాటాలనే ఉద్దేశంతో గ్రామానికో నర్సరీని ఏర్పాటు చేశారు. మరో 20రోజుల్లో హరితహారం కార్యక్రమం నిర్వహించనున్నారు. అందులో భాగంగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని పలు గ్రామాల్లోని నర్సరీల్లో ముందస్తు ప్రణాళికతో మట్టిని తీసుకొచ్చి బ్యాగ్ఫిల్లింగ్ చేసి విత్తనాలు వేశారు.
వేసవి, నర్సరీల నిర్వహణపై అధికారుల పర్యవేక్షణ కరువై విత్తనాలు మొలకెత్తలేదు. మొక్కల సంరక్షణకు తగిన చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలు గ్రామాల్లో అంతంత మాత్రంగానే విత్తనాలు మొలకెత్తాయని, మిగతా జాగ్రత్త చర్యలు పాటించకపోవడంతో వచ్చిన మొలకలు సైతం ఎండిపోయాయి. అవెన్యూ ప్లాంటేషన్‌లో మొక్కలు నాటాలంటే రెండు మీటర్ల పొడవు, అటవీ ప్రాంతాల్లో నాటాల్సిన మొక్కలు రెండు, మూడు ఫీట్ల ఎత్తు ఉండాలని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు కొత్తగా విత్తనాలు వేసినా అవి మొక్కలుగా మారేందుకు రెండు, మూడు నెలల సమయం పడుతుందని పలువురు పేర్కొంటున్నారు. జూన్ చివరి వారం లేదా జూలై మొదటి వారంలో నిర్వహించే హరితహారం కార్యక్రమంపై నీలినీడలు కమ్ముకున్నాయి.
నర్సరీల్లో నాటిన కొన్ని విత్తనాలు మొలకెత్తలేదు. వాటిస్థానంలో మరిన్ని విత్తనాలు వేస్తాం. 20-30 రోజుల్లో మొలకలు వచ్చే మొక్కల రకాలైన బొప్పాయి, మునగ లాంటి విత్తనాలు వేస్తాం.
– సంతోష్‌కుమార్, ఎంపీడీవో, సదాశివనగర్