ఆర్మూర్టౌన్, మే10: రాష్ట్రంలో ప్రజా సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మేల్యె జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రపంచ అందాల పోటీలతో తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ అవుతున్నదని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతికి మచ్చ తెచ్చేలా ఉన్న ప్రపంచ అందాల పోటీల నిర్వహణను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం మన దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాకూడా రూ.2కోట్లకు పైగా ప్రజాధనాన్ని వృథాచేస్తున్నారని మండిపడ్డారు. విష సంస్కృతికి తెరదీసి రాష్ట్ర శ్రమైక్య జీవన సౌందర్యాన్ని అప్రతిష్ట పాలు చేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు. యుద్ధ మేఘాలు కమ్ముకొని దేశమంతటా ప్రమాద ఘంటికలు, సైరన్ మోతలు,
విమానాశ్రయాల మూసివేతలు, విద్యుత్ సరాఫరా నిలిపివేతతో అల్లాడుతుంటే హైదరాబాద్లో అందాల ఆరబోతలేమిటని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న హత్యలు, లైంగిక దాడులను నిరోధించకుండా, విద్యా, వైద్యం, ఉద్యోగం,ఉపాధి, అవుట్ సోర్సింగ్ కార్మికులకు వేతనాలు,ఇండ్ల నిర్మాణం, పింఛన్లు తదితర అంశాలపై దృష్టి పెట్టకపోవడం దారుణమని పేర్కొన్నారు.