కోటగిరి, అక్టోబర్ 14: నిరుద్యోగుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ మండల యువజన విభాగం ఆధ్వర్యంలో కోటగిరి ఎంపీడీవో కార్యాయలయం ఎదుట మంగళవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల యువజన విభాగం నాయకుడు అంబటి గంగాప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ.. కులగణన సర్వేలో వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్ చేసేందుకు నిరుద్యోగ యువకులను ఉపయోగించుకున్నారని తెలిపారు.
సర్వేలో వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్ చేసేందుకు ఒక్కో దరఖాస్తుకు రూ.50 వరకు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. నిరుద్యోగులతో పనులు చేయించుకొని ఏడాది గడస్తున్నా ఇప్పటివరకు డబ్బులు చల్లించలేదని మండిపడ్డారు. ఒక్కో నిరుద్యోగ యువకుడికి రూ.పదివేలకుపైగా ప్రభుత్వం నుంచి రావాల్సి ఉన్నదని తెలిపారు. నిరుద్యోగ యువతతో పనులు చేయించుకొని డబ్బులు చెల్లించకపోవడం ఏమిటని మండిపడ్డారు.
నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చిన సర్కారు ఇంతవరకూ దాని ఊసే ఎత్తడం లేదన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డికి అందజేశారు. కార్యక్రమంలోబీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు సమీర్, కప్ప సంతోష్, మోరె గౌతంకుమార్, తెల్ల చిన్న అరవింద్, మహేశ్‌రెడ్డి, రుద్రాంగి సందీప్, యోగేశ్త, మామిడి వెంకటేశ్, సంతోష్ పాల్గొన్నారు.