ఆర్మూర్టౌన్/ నందిపేట్, అక్టోబర్ 17: హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్రెడ్డిపై ఆర్మూర్, నందిపేట్ పోలీసుస్టేషన్లలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు గురువారం ఫిర్యాదుచేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే పదవిలో ఉంటూ మతపరమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ సమాజంలో అశాంతి వాతావరణం సృష్టిస్తున్న ఎమ్మెల్యే రాకేశ్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
హిందువులను దుర్భాషలాడుతూ మనోభావాలను దెబ్బతీసేలా ఆయన చేసిన వ్యాఖ్యలతో భవిష్యత్తులో లా అండ్ ఆర్డర్ సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. వెంటనే హిందూ సమాజానికి ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పి, పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో బీఆర్ఎస్ ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు పూజా నరేందర్, నాయకులు గంగాధర్, పృథ్వీరాజ్, అగ్గు క్రాంతి, శ్రవణ్, మచ్చర్ల సాగర్, వెల్మల్ రాజన్న, బాలగంగాధర్, సురేందర్, ప్రవీణ్, రవి, రాజేశ్వర్, రాజేందర్ ఉన్నారు.
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిన ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఉత్తర తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతి డిమాండ్ చేశారు. గురువారం ఆమె విలేకరుల తో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని, క్షమాపణ చెప్పాలన్నారు. క్షమాపణలు చెప్పకపోతే ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.