బాన్సువాడ, ఏప్రిల్ 9: రాష్ట్రంలోని 23 వేల మంది విద్యుత్ కార్మికులను పర్మినెంట్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బాన్సువాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్, రైతుబంధు సమితి కామారెడ్డి జిల్లా మాజీ కన్వీనర్ దుద్దాల అంజిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బాన్సువాడ పట్టణంలోని విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట కొనసాగుతున్న విద్యుత్ కార్మికుల ధర్నాకు వారు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జుబేర్ మాట్లాడుతూ.. కొన్నేండ్లుగా ప్రజలకు కీలకమైన సేవలను అందిస్తున్న విద్యుత్ కార్మికులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న కార్మికుల భవిష్యత్తు, భద్రత కోసం వారిని వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం స్పందించని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
కార్యక్రమంలో నాయకులు బోచ రాంచందర్ ,ఖలీల్, ఫెరోజ్ ఖాన్, మాజీ కౌన్సిలర్ బాడి శ్రీనివాస్, అక్బర్ ,మైనార్టీ సెల్ నాయకుడు ఇషాక్, రమేశ్ యాదవ్, మన్నె అనిల్ కుమార్, కార్యకర్తలు, కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.