MLA Vemula Prashanth Reddy | బోధన్ : బోధన్ పట్టణ అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, షకీల్ హయాంలో మంజూరైన పనులను కూడా నిలిపివేసి ప్రజలను శిక్షిస్తోందని, త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర అన్నారు. బోధన్ పట్టణంలో సోమవారం జరిగిన బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ బోధన్ టౌన్ మీటింగ్ చూస్తుంటే నియోజకవర్గ, జిల్లా స్థాయి సభలా ఉందని, ప్రజల ఉత్సాహం చూస్తుంటే బోధన్ మున్సిపాలిటీపై మూడోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
షకీల్ నాయకత్వంలో 36 మంది కౌన్సిలర్లు భారీ మెజారిటీతో గెలవడం తథ్యమన్నారు. కేసీఆర్, కేటీఆర్ సహకారంతో షకీల్ బోధన్ అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేయించారని, అందులో రూ.60 కోట్ల పనులు పూర్తయ్యాయని గుర్తు చేశారు. అయితే గత రెండేళ్లుగా ఇక్కడి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం మిగిలిన రూ.40 కోట్ల పనులను చేయకుండా అడ్డుకుందని విమర్శించారు. రోడ్లన్నీ గుంతలమయంగా మారినా కనీసం మరమ్మతులు కూడా చేయలేని దౌర్భాగ్య స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, కేవలం దోచుకోవడమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు. సివిల్ సప్లైస్, లిక్కర్, బొగ్గు కుంభకోణాల్లో మంత్రులు, సీఎం వాటాల కోసం కొట్టుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
మత్రులు జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డిల మధ్య వాటాల పంపకాల్లో తేడాలు వచ్చి రోడ్డున పడ్డారని ఎద్దేవా చేశారు. షకీల్ హయాంలో పగడపల్లి వద్ద నదిపై చెక్ డ్యాం నిర్మించి రైతులకు మేలు చేశామని, ఇప్పుడున్న ఇరిగేషన్ శాఖ మంత్రి, స్థానిక పెద్ద మనుషులు ఒక్క కొత్త చెక్ డ్యాం ఎందుకు కట్టలేకపోయారని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ పట్టుకొని తిరిగిన చరిత్ర రేవంత్ రెడ్డిదని, అటువంటి వ్యక్తికి బీఆర్ఎస్ జెండాను తాకే నైతిక అర్హత లేదని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్థాయి నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. గత రెండేళ్లలో కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదన్నారు.
ఓటుకు నోటు కేసులో డబ్బు సంచులతో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి..
ఓటుకు నోటు దొంగ రేవంత్ తెలంగాణ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కొనడానికి డబ్బు సంచులతో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని, ఆయన ఒక తెలంగాణ ద్రోహి అని విమర్శించారు. చంద్రబాబు నాయుడు చెప్పుచేతల్లో నడిచే రేవంత్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కు చంద్రబాబు నాయుడు అడ్డు పడ్డాడు కాబట్టే తెలంగాణా ప్రజలు తెలుగుదేశం పార్టీ ని తెలంగాణ నుండి ఆంధ్రకు పంపించారు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా, ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. ముఖ్యంగా మహిళలకు, వృద్దులకు ఇచ్చిన మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతీ మహిళకు నెలకు రూ.2,500 ఇస్తామని రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ఈ రెండేళ్లలో ఆ డబ్బులు ఇవ్వకుండా మహిళలను మోసం చేశారు. అంటే ఒక్కో మహిళకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 60,000 బాకీ పడిందని ప్రశాంత్ రెడ్డి లెక్కలతో సహా వివరించారు. రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చిన హామీల వీడియోలను (పెన్షన్ పెంపు, మహిళలకు ఆర్థిక సాయం) ప్రతి ఇంటికి వెళ్లి చూపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మాట తప్పిన కాంగ్రెస్ కు ఓటు ఎందుకు వేయాలని, ప్రజలు కాంగ్రెస్ నాయకులను నిలదీయాలన్నారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ మాత్రమే శ్రీరామరక్ష అని, బీఆర్ఎస్ పార్టీని మళ్లీ గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. బోధన్ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
టికెట్ ఎవరికి వచ్చినా, అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీని గెలిపించాలని ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. బోధన్ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, అభివృద్ధిని అడ్డుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ మున్సిపల్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు షకీల్, గణేష్ గుప్తా, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్, గిర్ధవర్ గంగారెడ్డి, నర్సింగ్ రావు మాజీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచు లు ఎంపీటీసీలు, పార్టీ ప్రతినిధులు, పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.