కాంగ్రెస్, బీజేపీ కుట్రలపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కక్షపూరిత చర్యలను నిరసిస్తూ రోడ్డెక్కాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేయడమే కాకుండా పార్టీ అధినేత కేసీఆర్‌పై సీబీఐ విచారణను ఖండిస్తూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనలు నిర్వహించాయి. డిచ్‌పల్లిలో ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, కామారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఎల్లారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, మద్నూర్‌లో జుక్కల్ మాజీ శాసనసభ్యుడు హన్మంత్ షిండే నేతృత్వంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. నిజామాబాద్, ఆర్మూర్, వేల్పూర్, నందిపేట, ఎడపల్లి, కోటగిరి, పోతంగల్, చందూర్, మోస్రా, రుద్రూర్, బాన్సువాడ, నస్రుల్లాబాద్, నిజాంసాగర్, బిచ్కుంద, పెద్దకొడప్గల్, రాజంపేట్, బీబీపేట, భిక్కనూరు, దోమకొండ, రామారెడ్డి తదితర మండలాల్లో గులాబీ శ్రేణులు ఆందోళనలు నిర్వహించాయి. సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మలను దహనం చేశాయి.
కేసీఆర్‌ను టచ్ చేస్తే తెలంగాణ అగ్నిగుండమే : మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్
ఎల్లారెడ్డి రూరల్, సెప్టెంబర్ 2: తెలంగాణ తొలిసీఎం కేసీఆర్‌ను టచ్ చేస్తే రణరంగమేనని, రాష్ట్రం అగ్నిగుండమైతదని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ హెచ్చరించారు. ఎల్లారెడ్డి పట్టణంలోని తెలంగాణతల్లి ప్రాం గణం వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ తెచ్చిన యోధుడు కేసీఆర్ అని, ఆయన పదేండ్లలో రాష్ర్టాన్ని అభివృద్ధిలో దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో నిలిపారని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో వ్యవసాయం ఒక పండుగలా మారిందని, పంజాబ్ తర్వాత దేశంలో అత్యధిక పంటలు పండే రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దారని తెలిపారు.
వ్యవసాయాభివృద్ధి కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌తోనే సాధ్యమైందని చెప్పారు. కావాలనే కుట్రపూరితంగా గోదావరి జలాలను ఆంధ్రాకు తరలించడానికి, బనకచర్ల నింపడానికి రేవంత్‌రెడ్డి డ్రామా ఆడుతున్నాడని మండిపడ్డా రు. కాళేశ్వరం రెండు పిల్లర్లు డ్యామేజీ అయితే కట్టకుండా రెండేండ్ల నుంచి కాలాయాపన చేస్తూ ఆంధ్రాకు తొత్తుగా మారాడన్నారు. తెలంగాణ ఉనికిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిమీద ఉన్నదని తెలిపారు. వరదలో ఎల్లారెడ్డి మునిగిపోయి, రైతు లు తీవ్ర నష్టాలకు గురైతే వారిని పలకరించడానికి, పరిస్థితిని సమీక్షించడానికి మంత్రి, సీఎం రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఆదిమూలం సతీశ్‌కుమార్, ఎల్లారెడ్డి, వెల్లుట్ల సొసైటీల చైర్మన్లు ఏగుల నర్సింహులు, పటేల్ సాయి లు, మాజీ ఎంపీపీ ముదాం సాయిలు పాల్గొన్నారు.
డిచ్పల్లి, సెప్టెంబర్ 2 : తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ను ఎదుర్కోలేకనే కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నదని రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనను మరిచి కక్ష రాజకీయాలకు పాల్పడుతున్నదని ఆరోపించారు. మంగళవారం డిచ్పల్లి-నిజామాబాద్ ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించగా.. బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొని మాట్లాడారు. పరిపాలన చేతగాని కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉత్తర తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలమైందని, దీనిని ఓర్వలేకనే సీఎం రేవంత్‌రెడ్డి కేసీఆర్‌పై అక్రమ కేసులకు తెర లేపాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ సీబీఐకి అప్పగించడం దుర్మార్గమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్మోహన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శక్కరికొండ కృష్ణ, గడ్కోల్ భూషణ్‌రెడ్డి, పద్మారావు, మహేందర్‌యాదవ్, తొర్లికొండ రాజు పాల్గొన్నారు.
మద్నూర్, సెప్టెంబర్ 2: కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్‌రెడ్డి కుట్రలు చేస్తున్నారని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే ఆరోపించారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ అంటే కేసీఆర్‌ను బద్నాం చేయడానికే అని మండిపడ్డారు. మద్నూర్‌లో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పులినోట్లో తలకాయ పెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్‌పై కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని లక్షల ఎకరాలకు సాగునీరు అందేలా కేసీఆర్ కృషి చేశారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు.
కామారెడ్డి, సెప్టెంబర్ 2 : కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తున్నదని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్రలో భాగంగానే కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేపడుతున్నారని మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా, రాస్తారోకో కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేసీఆర్‌పైన చేస్తున్న కుట్ర మాత్రమే కాదని, తెలంగాణ నదీ జలాలను పక్క రాష్ర్టాలకు తరలించి,కాళేశ్వరాన్ని ఎండబెట్టే ప్రయత్నంలో భాగంగానే సీబీఐ విచారణ అని పేర్కొన్నారు. కాళేశ్వరాన్ని సీబీఐకి అప్పజెప్పడమంటే ప్రాజెక్టును మూసివేయడమే అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థను తెరపైకి తెచ్చి డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేవలం కేసీఆర్‌ను బద్నాం చేయడానికే సీబీఐ విచారణ చేపడుతున్నారని ఆరోపించారు.
ఘోష్ కమిటీ నివేదికపై అసెంబ్లీలోనే చర్చించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తన దద్దమ్మ పాలనను డైవర్ట్ చేయడానికే సీబీఐ పేరిట కాలయాపన చేస్తున్నదని మండిపడ్డారు. కేసీఆర్‌ను మనోవేదనకు గురి చేయడానికి, తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను ప్రతి అంశంలో మోసం చేసిందని అన్నారు. రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమని ధీమా వ్యక్తంచేశారు. కేసీఆర్‌కు అండగా ఉంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి, నాయకులు రవియాదవ్, సుమిత్రానంద్, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.