కామారెడ్డి రూరల్ , అక్టోబర్ 17: ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఏర్పాటు చేసిన వార్డు స్థాయి కమిటీల్లో తాము ఇచ్చిన పేర్లు కాకుండా కాంగ్రెస్ నాయకుల పేర్లను చేర్చడంపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయమై వారు మున్సిపల్ కార్యాలయంలో గురువారం కమిషనర్ సుజాతను నిలదీశారు. ఇందిరమ్మ కమిటీలో స్థానిక కౌన్సిలర్ చైర్మన్‌గా, స్వయంసహాయక సంఘాల నుంచి ఇద్దరు మహిళలు, వార్డులో ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీల నుంచి ఒక్కొక్కరి చొప్పున సభ్యులు ఉండగా.. వార్డు ఆఫీసర్ కన్వీనర్‌గా ఉంటారని మున్సిపల్ కమిషనర్ ఇటీవల ప్రకటించారు.
అయితే పట్టణంలోని 49 వార్డుల్లో స్థానిక వార్డు కౌన్సిలర్ సూచించిన వారిని కాకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారి పేర్లను కమిటీలో చేర్చడంపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు పిట్ల వేణు, అంజల్ రెడ్డి, గెరిగంటి స్వప్న, నజీరుద్దీన్, భాస్కర్ గౌడ్, హఫీజ్‌తోపాటు మరికొందరు అభ్యంతరం వ్యక్తంచేశారు. 43వ వార్డుకు చెందిన మాజీ వైస్ చైర్మన్ మసూద్ అలీ.. 25వ వార్డు కమిటీలో ఎలా ఉంటాడని స్థానిక వార్డు కౌన్సిలర్ అంజల్రెడ్డి ప్రశ్నించారు. తన వార్డులో మొత్తం కాంగ్రెస్ నాయకుల పేర్లు చేర్చారని 47వ వార్డు కౌన్సిలర్ కమిషనర్‌ను నిలదీశారు. ఇన్చార్జి మంత్రి ఆదేశాల మేరకు పేర్లను మార్చినట్లు కమిషనర్ సమాధానం ఇచ్చారు. దీంతో బీఆర్ఎస్ కౌన్సిలర్లు కలెక్టరేట్‌కు తరలివెళ్లి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.