కామారెడ్డి, మే 29 : సెలవుల్లో అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఓ బాలుడు ఆడుకుంటూ వెళ్లి నీటి కుంటలో పడి మృతి చెందాడు. ఈ ఘటన మాచారెడ్డి మండలం కొత్తపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకోగా..గురువారం వెలుగులోకి వచ్చింది.
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన సందీప్-శ్రీలత దంపతులకు రెండో కుమారుడైన యశ్వంత్ (4) రెండు రోజుల క్రితం అమ్మమ్మ బరిగె నర్సవ్వ గ్రామమైన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం కొత్తపల్లికి వచ్చాడు. బుధవారం ఇంటి బయట ఆడుకుంటూ ఉండగా నీటి కుంటలో పడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు గ్రామానికి చేరుకొని గుండెలవిసేలా రోదించారు. బాలుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.