Sarangapur | సారంగాపూర్ : ప్రకృతితో మమేకం కావడమే మానవాళికి రక్షణ అని, బోనాలు పండుగ అంటే ప్రకృతిలో భాగమైన మట్టికి, నీటికి, పాడికి, పంటకు అమ్మవారి రూపంలో దండం పెట్టుకోవడం అని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సారంగపూర్ ప్రధానోపాధ్యాయుడు ఏ పోశన్న అన్నారు. పాఠశాలలో మంగళవారం జరిగిన బోనాలు ఉత్సవంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కార్పొరేటర్ హరిచంద్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిలో బోనాలు విశిష్టమైనదని అన్నారు. తెలుగు ఉపాధ్యాయులు, ప్రముఖ కవి ఘనపురం దేవేందర్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిలో ఆషాఢ మాసానికి అత్యంత ప్రాధాన్యత ఉందన్నారు..
ఈ మాసంలో గ్రామ దేవతలను, ముఖ్యంగా జగన్మాత మహంకాళి అమ్మవారిని ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, పెద్దమ్మ రూపాలలో కొలిచి, భక్తితో బోనాలు సమర్పించడం మన ప్రాచీన సంప్రదాయం. ప్రజల ఆరోగ్యం, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలగాలని, పంటలు సుభిక్షంగా పండాలని, సమాజానికి ఎలాంటి ఆపదలు రాకూడదని కోరుకుంటూ అమ్మవారికి నైవేద్యం సమర్పించి కృతజ్ఞతలు తెలియజేయడం అని వివరించారు. పాఠశాల నుండి గ్రామంలోని పెద్దమ్మ దేవాలయం వరకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు బోనాల ఊరేగింపును జరిపారు. పాఠశాలలో సర్వాంగ సుందరంగా అలంకరించిన అమ్మవారికి బోనాలు సమర్పించారు. అనంతరం విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు డాక్టర్ సల్ల సత్యనారాయణ, డి గోపాల్, జావిద్ హుస్సేన్, విద్యాసాగర్, ఘనపురం దేవేందర్, కే.లలిత, శ్రీలత, నిర్మల, సునంద, సుజాత, ఏ లలిత, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.