బోధన్/బోధన్ రూరల్/మోర్తాడ్/ ముప్కాల్/ మాక్లూర్/ ఆర్మూర్‌టౌన్/ఇందల్వాయి/సుభాష్‌నగర్ , జూలై 7: బోధన్ పట్టణంలో ఆదివారం పూసల సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహాలక్ష్మీ మందిరంలో నైవేద్యాలు సమర్పించారు. వర్షాలు కురవాలని, పాడిపంటలు బాగుండాలని కోరారు. బోధన్ మండలంలోని ఖండ్గామ్ గ్రామంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ నిర్వహించారు. కమ్మర్పల్లి, మోర్తాడ్ మండలాల్లోని అన్ని గ్రామాల్లో కులసంఘాల ఆధ్వర్యంలో గ్రామదేవతలకు పూజలు నిర్వహించి, కుటుంబ సమేతంగా వనభోజనాలకు వెళ్లారు. ముప్కాల్ మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామ దేవతలకు గంగనీళ్లతో జలాభిషేకం నిర్వహించారు. మాక్లూర్ మండలంలోని ముల్లంగి(బీ), మాక్లూర్, మాదాపూర్ తదితర గ్రామాల్లో ప్రజలు గ్రామదేవతలకు మొక్కులు చెల్లించుకుని వనభోజనాలకు వెళ్లారు.
ముల్లంగి(బి)లో గొల్ల, కురుమ కులస్తులు బీరప్ప దేవుడికి మొక్కులు చెల్లించుకుని మేకలు బలిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని నల్ల పోచమ్మ, పెద్దమ్మ తల్లి, ముత్యాలమ్మ, మహాలక్ష్మీ ఆలయాల్లో భక్తులు అమ్మవార్లకు పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి వన భోజనాలకు వెళ్లారు. ఇందల్వాయి మండలంలోని అన్సాన్పల్లి, నల్లవెల్లి, ఎల్లారెడ్డిపల్లి, తిర్మన్పల్లిలోని గ్రామదేవతలకు ప్రజలు జలాభిషేకం చేసి పూజలు చేశారు. అనంతరం వనభోజనాలకు తరలివెళ్లారు. ఆషాఢమాసంలో మొదటి ఆదివారం సందర్భంగా వినాయక్‌నగర్‌లోని మహాలక్ష్మీ ఆలయంలో పద్మశాలీ 46వ తర్ప ఆధ్వర్యంలో పూజలు చేశారు. అనంతరం పదోతరగతి పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు రూ.1000 చొప్పున అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో తర్ప సంఘం అధ్యక్షుడు కొండ గంగాచరణ్, కార్యదర్శి క్యాతం గంగాధర్, కోశాధికారి చాట్ల రవీందర్ సభ్యులు పాల్గొన్నారు.