బోధన్, ఆగస్టు 15: బోధన్ అసెంబ్లీ నియోజకవర్గంలో తన ఎన్నికల ప్రచా రం బుధవారం నుంచి ప్రారంభంకానున్నదని, పట్టణంలో బీఆర్ఎస్ బూత్ కమిటీల సభ్యులు, పార్టీ కార్యకర్తలతో పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తున్నట్లు బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ వెల్లడించారు. ఈ భారీ సభ నుంచే తన ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించనున్నట్లు, సభకు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే షకీల్ మాట్లాడారు. శక్కర్‌నగర్‌లోని నిజాంషుగర్స్ గ్రౌండ్స్‌లో బుధవారం ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమవుతుందన్నారు. రాష్ట్రంలోనే మొట్ట మొదటిసారిగా బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం బోధన్ నియోజకవర్గంలో ప్రారంభంకానుండడం విశేషమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
నియోజకవర్గంలో బీఆర్ఎస్కు అనూహ్యంగా వస్తున్న మద్దతును గమనిస్తున్న ప్రత్యర్థులకు గుబులు పట్టుకున్నదని, ఇప్పటి వరకు పోటీకి సై అన్న ప్రతిపక్షాల అభ్యర్థులు పోటీచేయాలా.. జారుకోవాలా అన్న సందిగ్ధంలో పడ్డారని ఎమ్మెల్యే షకీల్ ఎద్దేవా చేశారు. తనపై పోటీచేయాలనుకుంటున్న ఓ మాజీ మంత్రి ఇల్లు ఎక్కడ ఉందో కూడా నియోజకవర్గంలోని 95 శాతం ప్రజలకు తెల్వదని విమర్శించారు. బోధన్ నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్ నాయకత్వంలో వందలాది కోట్లతో అభివృద్ధి చేశామని, ఈసారి బీఆర్ఎస్ అత్యధిక మెజారిటీతో గెలవడం ఖాయమని షకీల్ అన్నారు. విలేకరుల సమావేశంలో డీసీసీబీ డైరెక్టర్ గిర్దావర్ గంగారెడ్డి, బీఆర్ఎస్ బోధన్ పట్టణ అధ్యక్షుడు గాండ్ల రవీందర్‌యాదవ్, బోధన్ ఏఎంసీ చైర్మన్ వెంకటేశ్వరావు దేశాయ్, బోధన్ వైస్ ఎంపీపీ కోట గంగారెడ్డి, బీఆర్ఎస్ బోధన్, ఎడపల్లి మండలాల అధ్యక్షులు గోగినేని నర్సయ్య, డి.శ్రీరామ్, ఏఎంసీ వైస్ చైర్మన్ సాలూర షకీల్, నాయకులు పాల్గొన్నారు.