వేల్పూర్, ఏప్రిల్ 5 : తెలంగాణ అభివృద్ధిలో బీజేపీ పాత్ర సున్నా అని, కేంద్రమే నిధులిస్తున్నట్లు ఆ పార్టీ నాయకులు పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎవరు అభివృద్ధి చేస్తున్నారు? ఎవరు అసత్యాలు చెబుతున్నారో ప్రజలు ఆలోచించాలని సూచించారు.
మండలంలోని 44వ నంబర్ జాతీయ రహదారి నుంచి 63వ నంబర్ జాతీయ రహదారి వరకు జాన్కంపేట్, సాహెబ్పేట్, వేల్పూర్, వెంకటాపూర్, కోమన్‌పల్లి, కుకునూర్ గ్రామాల మీదుగా రూ. 36 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు పునరుద్ధరణ పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రోడ్ల అభివృద్ధికి మంజూరు చేసిన నిధుల వివరాలను మంత్రి ప్రజల ముందుంచారు. తనకు ఇలాంటివి నచ్చకపోయినా బీజేపీ నాయకులు చెబుతున్న అబద్ధాలు, వాస్తవాలు ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతోనే బ్యానర్ రూపంలో బహిర్గతం చేస్తున్నట్లు తెలిపారు.
కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వం నుంచి సెస్సు వసూలు చేసి అందులోనుంచే సీఆర్ఐఎఫ్ వర్క్స్ కింద తిరిగి నిధులు మంజూరు చేస్తున్నదని తెలిపారు. ఇక ఇందులో ప్రత్యేకంగా కేంద్రం ఇచ్చింది, ఎంపీ అర్వింద్ తెచ్చిందేమిటని ప్రశ్నించారు. సెస్ కింద వసూలు చేసిన డబ్బులు రోడ్ల అభివృద్ధి కోసం దేశమంతటా ఇవ్వడం ఏండ్ల తరబడి వస్తున్న సంప్రదాయమన్నారు. రోడ్ల మంత్రిగా తనకు నిధులు ఎట్లా వస్తాయో తెలుసన్నారు.
అర్వింద్ కోరుట్ల నియోజకవర్గంలో ఒక్క రోడ్డుకే ప్రతిపాదనలు పెట్టాడని, సీఆర్ఐఎఫ్ కింద నిజామాబాద్ జిల్లాలోని ఏ ఒక్క గ్రామానికీ రోడ్డు అడగలేదన్నారు. తాను, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి కలిసి రూరల్, బాల్కొండ నియోజకవర్గాలకు తొమ్మిది కిలోమీటర్ల మేర రూ. 15కోట్ల ప్రపోజల్ పెట్టామని ఆధారాలతో వివరించారు. నిధుల మంజూరుపై రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి సునీల్‌శర్మ 2021లో రాసిన పుస్తకాన్ని ప్రదర్శించి ప్రజలకు వాస్తవాలను చెప్పారు.
వండిన దాంట్లో బీజేపీ నాయకులు గంటే తిప్పి.. ‘ఇది మాదే’ అనే రకమని ఎద్దేవా చేశారు. వారి మాటలు నమ్మొద్దని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీసీసీబీ వైస్‌చైర్మన్ రమేశ్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు తీగెల రాధామోహన్, సుధాకర్‌గౌడ్, సౌడ రమేశ్, విజయ, ఎంపీపీ భీమ జమున, జడ్పీటీసీ అలకొండ భారతి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.