బీఆర్ఎస్లోకి చేరికల జోరు కొనసాగుతున్నది. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సమక్షంలో బుధవారం ఐదు వందల మందికి పైగా గులాబీ గూటికి చేరారు. వారికి జీవన్‌రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఆర్మూర్, జూన్ 7: సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శమని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. దేశంలో ఇంటింటికీ తాగునీరు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని పేర్కొన్నారు. పసుపు బోర్డు తెస్తానని ఎంపీగా గెలిచిన ధర్మపురి అర్విం ద్..రైతులను మోసం చేశారని అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆర్మూర్ గూండ్ల చెరువులోని మినీ ట్యాంకు వద్ద బుధవారం నిర్వహించిన సాగునీటి ఉత్సవంలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు అంకాపూర్ గ్రామంలోని తన నివాసంలో నందిపేట మండలం తల్వేదకు చెందిన 500మందికి పైగా యువకులు, గ్రామస్తులు జీవన్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎంపీ అర్వింద్‌పై నిప్పులు చెరిగారు. ఆయన ఎక్కడ పోటీ చేసినా డిపాజిట్లు రాకుండా ఓడిస్తామన్నారు. వచ్చే ఎన్నికలతో ఆయన రాజకీయ ప్రస్థానం క్లోజ్ అని పేర్కొన్నారు. అడ్డగోలుగా వాగితే నాలుక చీరేస్తామని హెచ్చరించారు. అంబేద్కర్ చౌరస్తాలో బట్టలూడదీసి కొడతామన్నారు. ఆయనకు దమ్ముంటే ఆర్మూర్ అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో ఆయన వాటా ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు.
నాలుగేండ్లుగా ముఖం చాటేసి ఇప్పుడు ఆర్మూర్‌కు వచ్చిన ఎంపీ అర్వింద్‌ను ఎవరూ పట్టించుకోరన్నారు. నిజామాబాద్ జిల్లా బీజేపీలో తొమ్మిది గ్రూపులు ఉన్నాయని తెలిపారు. ఆర్మూర్‌లో ఉన్న తొమ్మిది మంది తామే అభ్యర్థులమంటూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. అవినీతికి ప్యాంట్, చొక్కా వేస్తే అది ఎంపీ అర్వింద్ రూపమని విమర్శించారు. ప్రజల కష్టాలను ఏనాడు పట్టించుకోని అర్వింద్‌ను ఏ గ్రామానికి వెళ్లినా చితకబాదడం ఖాయమన్నారు. ప్రజల మధ్య పంచాయితీ పెట్లే తాకట్లమారి అని మండిపడ్డారు. ఆరాచక శక్తుల జేఏసీకి అధ్యక్షుడని, పసుపు బోర్డు తేకుండా రైతుల వెన్ను విరిచిన మోసగాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్మూర్‌లో అర్వింద్ చేసింది రోడ్‌షో కాదని, అదొక బ్యాడ్ షో అని అన్నారు. ఎమ్మెల్సీ కవితపై అర్వింద్‌కు ఎందుకంత అక్కసు అని మండిపడ్డారు. మంత్రి కేటీఆర్‌ను విమర్శించే స్థాయి ఆయనకు లేదన్నారు. కార్య క్రమంలో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, జడ్పీ సీఈవో గోవింద్, మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినిత, వైస్ చైర్మన్ మున్నా, ఎంపీపీ పస్క నర్సయ్య, సంతోష్, ప్రభాకర్, జడ్పీటీసీ సంతోష్, పట్టణ అధ్యక్షుడు పూజా నరేందర్, నాయకులు సంజయ్సింగ్బబ్లూ, రజనీష్, చిన్నారెడ్డి, దేవేందర్, సాయిరామ్, వినోద్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.