బీఆర్ఎస్లోకి వలసల జోరు కొనసాగుతున్నది. వరుస చేరికలతో అధికార పార్టీ మరింత బలపడుతున్నది. కారు జోరుకు కమలం, కాంగ్రెస్ పార్టీలు బేజారవుతున్నాయి. సీఎం కేసీఆర్‌కు జైకొడుతూ బీజేపీ కార్యకర్తలు గులాబీ గూటికి చేరుతున్నారు. శ్రేణులు చేజారిపోతుండగా నేతలు తలలు పట్టుకుంటున్నారు. క్యాడర్‌ను కాపాడుకోలేని ఎంపీ అర్వింద్.. తప్పుడు కూతలు కూస్తూ జనంలో మరింత చులకన అవుతున్నాడు. ఇక, కాంగ్రెస్ నుంచి వలసలు కొనసాగుతున్నాయి. ఆ పార్టీకి చెందిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు ఎందరో బీఆర్ఎస్లో చేరారు. రానున్న రోజుల్లో మరింత మంది కారు ఎక్కనున్నారు. కండ్ల ముందు కనిపిస్తున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ నేతలకు మింగుడు పడడం లేదు.
నిజామాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు పెరుగుతుండడంతో కమలం పార్టీలో కల్లోలం పుడుతున్నది. జారవీడుతున్న నేతలను కాపాడుకోలేక కాషాయ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లా బీజేపీలో అంతర్గత కుమ్ములాటలతోపాటు ఎంపీ అర్వింద్ తీరును నిరసిస్తూ చాలా మంది బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. నిత్యం రాష్ట్ర ప్రభుత్వాన్ని అబద్ధాలు, అసంబద్ధ వ్యాఖ్యలతో నిందించడం మినహా కేంద్రం ద్వారా మేలు చేసే ఏ ఒక్క కార్యక్రమమూ చేపట్టకపోవడం బీజేపీ ప్రజాప్రతినిధులను ఒకింత అసహనానికి గురిచేసింది. ప్రజల ఓట్లతో గెలిచిన వారంతా తిరిగి ప్రజలకు మేలు చేయాలంటే భారత రాష్ట్ర సమితి ఒక్కటే మార్గమని భావిస్తున్నారు. గులాబీ కండువాను కప్పుకొని ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసేందుకు కారెక్కుతున్నారు. వరుసగా బీజేపీని వీడి అధికార బీఆర్ఎస్ పార్టీకి జై కొడుతున్న వారిలో యువత సైతం పెద్ద సంఖ్యలో ఉంటుండడం చర్చనీయాంశం అవుతున్నది. ప్రధాని మోదీ తీరు, బీజేపీ అవలంబిస్తున్న విధానాలు నచ్చక వారంతా కాషాయ పార్టీని వీడి కారెక్కుతుండడం విశేషం. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అంతటా వలసల జోరు కనిపిస్తున్నది. నిజామాబాద్ అర్బన్, రూరల్, బాల్కొండ, ఆర్మూర్, కామారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాల్లో మరింత ఎక్కువగా ఉన్నది.
అర్వింద్‌పై వ్యతిరేకత…
నిజామాబాద్ లోక్‌సభ సభ్యుడు ధర్మపురి అర్వింద్.. సొంత పార్టీలో నాయకులు, ప్రజాప్రతినిధుల విశ్వాసం కోల్పోతున్నాడు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చలేక చతికిలపడిన ఎంపీపై ఇంటా, బయటా వ్యతిరేకత పెరుగుతున్నది. పసుపు బోర్డు అంశంపై రైతన్నలంతా ఎంపీని వెంటాడుతున్నారు. ఈ దశలోనే నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో బీజేపీ తరఫు పోటీ చేసి గెలిచిన కార్పొరేటర్లు అర్వింద్ తీరును ఆది నుంచి తప్పు పడుతున్నారు. ప్రజల ఓట్లతో గెలిచిన తాము జనాలకు మేలు చేయాలంటే బీఆర్ఎస్ పార్టీయే చక్కని వేదిక అని ఎలుగెత్తి చాటుతున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పటికీ నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి ఎంపీగా ధర్మపురి అర్వింద్ తీసుకుంటున్న చొరవ శూన్యమంటూ విమర్శిస్తున్నారు. నిత్యం నోటి మాటలే తప్ప అభివృద్ధిలో పోటీ పడకలేక పిచ్చి ప్రేలాపనలు చేస్తూ రెచ్చగొట్టడం సరికాదంటూ సొంత పార్టీ నేతలే గుస్సా అవుతున్నారు. ఎంపీ అర్వింద్‌కు గతంలోనే కార్పొరేటర్లంతా గట్టి హెచ్చరికలు జారీ చేశారు. తీరు మార్చుకోకపోతే బీజేపీని వదులుతామని తేల్చిచెప్పారు. ఎంపీ అర్వింద్ తన వ్యవహార శైలి మారలేదు.. సరికదా అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సహకరించకపోవడం వంటి కారణాలతో కమలం పార్టీకి టాటా చెప్పి కారెక్కుతున్నారు. ఇప్పటివరకు పది మందికిపైగా కార్పొరేటర్లు బీజేపీ నుంచి బయటికి వచ్చారు.
పెరుగుతున్న వలసలు…
బీజేపీ ఆది నుంచి యువతను మచ్చిక చేసుకుని వక్రబుద్ధిని చొప్పించి వారి జీవితాలతో ఆటాడుతున్నది. సోషల్ మీడియా బాధ్యతలను అప్పగించి వారితో చేయరాని పనులను చేయిస్తున్నది. ఈ వ్యవహారాన్ని కనిపెట్టి తమ జీవితాలను బాగు చేసుకునేందుకు ఇప్పుడిప్పుడే బీజేపీలోని యువ మోర్చా నాయకుల్లో మార్పు వస్తున్నది. ఇందుకు మొన్నటికి మొన్న రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నియోజకవర్గంలోనే పెద్ద సంఖ్యలో బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరిన యువకులే నిదర్శనంగా నిలుస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించి భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందిన తర్వాత గులాబీ అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. పక్క రాష్ట్ర ప్రజల నుంచి వస్తున్న విన్నపాలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ సైతం మహారాష్ట్రలో పార్టీని విస్తరించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ కోణంలో ప్రజల్లోనూ పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నది. సంక్షేమ పాలన, ప్రజా అనుకూల ప్రభుత్వమే దేశానికి అవసరమని, అది కేవలం కేసీఆర్‌తోనే సాధ్యమన్న భావన ప్రజల్లో పెరుగుతున్నది. ఇందులో భాగంగా పక్క రాష్ర్టాలతో పాటు బీఆర్ఎస్ పార్టీలోకి జాతీయ పార్టీల నుంచి పెద్ద ఎత్తున వలసలు పెరుగుతుండడం చర్చనీయాంశం అవుతున్నది. గులాబీ పార్టీ ఆవిర్భావం నుంచి నిజామాబాద్ జిల్లా కంచుకోటగా నిలుస్తున్నది. ఉద్యమం నాటి నుంచి నేటి వరకు ఉభయ జిల్లాల ప్రజలంతా కేసీఆర్‌కే మద్దతు పలుకుతున్నారు. జాతీయ పార్టీలకు కనీసం డిపాజిట్ దక్కకుండా ప్రతి ఎన్నికల్లోనూ బీఆర్ఎస్కే ప్రజలంతా పట్టం కడుతున్నారు. వరుసగా ఏ ఎన్నికలొచ్చినా ఏకపక్ష విజయాలను అందిస్తున్నారు.
హస్తంలోనూ కలవరం…
నెల రోజుల క్రితమే నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన చందూర్ ఎంపీపీ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. జాతీయ పార్టీగా క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన హస్తం పార్టీ వ్యవహరిస్తున్న తీరును నచ్చక కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీఆర్ఎస్ గూటికి చేరారు. స్థానిక సంస్థల్లో అరకొర సభ్యులను మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ఇది కోలుకోలేని దెబ్బ. ప్రజల విశ్వాసంతోపాటు పార్టీ నాయకత్వంలోనూ ఆదరణ కోల్పోవడంతోనే ప్రజాప్రతినిధులు సైతం కీలక సమయంలో బీఆర్ఎస్కే జై కొడుతుండడం విశేషం.
తన వారిని కాపాడుకునేందుకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. బీజేపీలో వర్గపోరుతో సహా ఎంపీ అర్వింద్‌పై వ్యతిరేకతతో అనేక మంది ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ముఖ్యంగా మహిళా ప్రజాప్రతినిధులు సైతం బీజేపీలో ఉండేందుకు ఇష్టపడడం లేదు. ఎంపీ అర్వింద్ సొంత పార్టీ నాయకులను చులకనగా చూడడంతోపాటు కనీస విలువ ఇవ్వకపోవడంతో పార్టీలోనే ఆయనకు వ్యతిరేకంగా కాషాయ శ్రేణులు గ్రూపులు కడుతున్నాయి.
ఆడ, మగ తేడా లేకుండా పరుష పదజాలంతో దూషించడాన్ని ఎవరూ జీర్ణించుకోలేక పోతున్నారు. ఎంపీగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ప్రజల ఓట్లతో గెలిచిన స్థానిక ప్రజా ప్రతినిధులు, సొంత పార్టీ నాయకులను ఘోరంగా అవమానించడం ఏంటంటూ వారంతా మండిపడుతూనే పార్టీ వీడుతూ అర్వింద్‌కు బుద్ధి చెబుతున్నారు.