కంఠేశ్వర్ : నిజామాబాద్ జిల్లాను ఎలా అభివృద్ది చేయాలో కాంగ్రెస్ పార్టీకి తెలుసని సేవాదళ్ (Sevadal) జిల్లా అధ్యక్షుడు వైసాక్షి సంతోష్ అన్నారు. గడిచిన 40 ఏళ్లుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ( MLA Sudarsan Reddy ) విమర్శించే హక్కు ఎంపీ అరవింద్, బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారికి లేదని సూచించారు.
కాంగ్రెస్ ( Congress ) పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి పదేళ్లు కావస్తున్నా జిల్లాకు జవహర్ నవోదయ కలగానే మిగిలిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రేవంత్ రెడ్డి సహకారంతో మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జవహర్ నవోదయ (Jawahar Navodaya) కోసం కృషి చేశారని, ఈ విషయం తెలుసుకోకుండా మాజీ మంత్రిపై విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు.
జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్న నాయకుల దిష్టిబొమ్మ దగ్ధం చేయడం సరి కాదన్నారు. డిచ్పల్లి తెలంగాణ యూనివర్సిటీకి సుదర్శన్ రెడ్డి ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. బీజేపీ నాయకులు ఆరోపణలు మానుకొని జిల్లా అభివృద్ధి గురించి ఆలోచించాలని సూచించారు. సమావేశంలో సేవాదళ్ జిల్లా ఉపాధ్యక్షులు ఆకుల వెంకటేష్, జాయింట్ కార్యదర్శి అప్సర్, శీలమంతుల రాజు తదితరులు పాల్గొన్నారు.