కంటేశ్వర్ : పసుపు బోర్డు ( Turmeric farmers ) తెచ్చామని గప్పాలు కొడుతున్న బీజేపీ నాయకులు బోర్డు ఎక్కడ ఏర్పాటు చేశారో చెప్పాలని మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి (Muppa Gangareddy ) ప్రశ్నించారు. గిట్టు బాటు ధర రాక రైతులు అల్లాడి పోతున్నారని వారికి భరోసా ఇవ్వాల్సిన బీజేపీ (BJP Leaders) నేతలు ఎక్కడ దాక్కున్నారని నిలదీశారు.
గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొన్ని రోజులుగా పసుపునకు మద్దతు ధర లేక రైతులు రోడ్డు ఎక్కి ఆందోళన చేస్తున్న రైతుల గురించి బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ( MP Aravinnd ) కి, నాయకులకు కనిపించడం లేదని ఆగ్రహించారు. రైతులకు గిట్టుబాటు ధరలు ఆకాశాన్ని తాకే విధంగా ఉంటాయని, మభ్యమెట్టి రైతులను మోసం చేశారని ధ్వజమెత్తారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హోటల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేసి సంబరాలు జరుపు కున్నారని ఎద్దేవా చేశారు. నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా తనకు కనీసం పసుపు బోర్డు ఎక్కడ ఏర్పాటు చేశారో తెలియదని పేర్కొన్నారు. పసుపు బోర్డు తీసుకువచ్చామని చెబుతున్న ఎంపీ ధర్మపురి అరవింద్ కనీసం పసుపు రైతులను పరామర్శించడం లేదని విమర్శించారు.
ఎంపీ ఢిల్లీలో కూర్చొని పైరవీలు చేయటానికే సరిపోతున్నారని అన్నారు. ఎన్నికలకు ముందు పసుపు బోర్డు వస్తే మద్దతు ధర రూ 20,000 ఉంటుందని పసుపునకు దేశంలో మంచి డిమాండ్ ఉందని కలబొల్లి మాటలతో మభ్యపెట్టారని ఆరోపించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారికు తామే ధీటైనా జవాబు చెబుతామని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అవసరం లేదని అన్నారు.
నవోదయ విషయంలో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు సరికావని అన్నారు. బీజేపీ చేసిన అభివృద్ధిపై ఎక్కడికి రమ్మంటారో చెప్పాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.