Bike accident | వినాయక నగర్, జులై 9: కుక్కను తప్పించబోయి బైక్ ప్రమాదానికి గురైంది. ఈఘటన నిజామాబాద్ ఇంటలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న ఏఎస్సై భార్య మృతి చెందింది. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. నిజామాబాద్ ఇంటలిజెన్స్ విభాగంలో ఇంటెలిజెన్స్ ఏఎస్ఐగా పనిచేస్తున్న భీమారావు రెండో కుమారుడు మరో వారం రోజుల్లో ఆస్ట్రేలియాకు వెళ్లనున్నాడు. ఈ క్రమంలో ఏఎసై భార్య భవాని తన కుమారుడితో కలిసి ఆమె నిర్మల్ జిల్లా బాసర అమ్మవారి దర్శనానికి వెళ్లి తిరిగి నిజామాబాద్‌కు వస్తున్నారు.
ఈ క్రమంలో నగర శివారులోని కంటేశ్వర్ బైపాస్ రోడ్డు పరిధిలో వీరి ద్విచక్ర వాహనానికి కుక్క అడ్డు వచ్చింది. దీంతో దాన్ని తప్పించబోయే క్రమంలో ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో బైక్ పై వెనకాల కూర్చున్న భవాని కింద పడడంతో తలకు బలమైన గాయమైంది. గమనించిన స్థానికులు ఆమెను హుటాహుటిన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు మరణించినట్లుగా నిర్ధారించారు.
అయితే వారం రోజుల్లో కుమారుడు విదేశాలకు వెళుతున్నాడని సంతోషంలో దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తన సతీమణి మృతి చెందిన విషయం తెలియడంతో ఇంటలిజెన్స్ ఏఎస్ఐ భీమారావు కన్నీరు మునీరుగా విలపించారు. భవాని మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. ఏఎస్ఐ సతీమణి మృతి చెందిన విషయం తెలియడంతో ఏఎస్ఐ తోటి సిబ్బంది తో పాటు ఇతర పోలీస్ సిబ్బంది అధికారులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చరి వద్దకు చేరుకున్నారు. కాగా ప్రమాద ఘటన పై పోలీసులు కేసు దర్యాప్తు నిర్వహిస్తున్నారు.