సిరికొండ, ఏప్రిల్ 1: ఇటీవల జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి గళమెత్తలేదని బీఆర్ఎస్ పార్టీ రూరల్ ఇన్చార్జి బాజిరెడ్డి జగన్ అన్నారు. ప్రజా సమస్యలపై ఆయనకు పట్టింపులేదని విమర్శించారు. బుధవారం ఆయన మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. రూరల్ ఎమ్మెల్యే గడ్డి మందు నిషేధం, అప్రోచ్ రోడ్డు పై మాట్లాడారే తప్ప ప్రజా సమస్యలపై నోరు మెదపకపోవడం విడ్డూరమని పేర్కొన్నారు. మంచిప్ప రిజర్వాయర్, రామడుగు ప్రాజెక్టు నుంచి సాగు నీరు అందించేందుకు కృషి చేయకపోగా, భారీ వర్షాలతో రైతులకు జరిగిన నష్టానికి పరిహారం అందించలేక పోయారని మండిపడ్డారు.
సీఎం రేవంత్ రెడ్డి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని తెలిపారు. రోడ్లు కోతకు గురై బ్రిడ్జిలు తెగిపోతే తాత్కాలిక మరమ్మతులు చేపట్టి కాంట్రాక్టర్ల స్వలాభం కోసం పని చేశారే తప్ప, ప్రజల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడిన దాఖలాలు లేవన్నారు. హనుమాన్ జయంతి రోజున గ్రామ సభలు నిర్వహించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నారవోయిన శ్రీనివాస్, నాయకులు రమాకాంత్, భూషణ్, రాజు, శివారెడ్డి, రాజిరెడ్డి, సుదర్శన్, నాని రఘు, రాములు నాయక్, తిరుపతి, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.