భిక్కనూరు, జనవరి 5: అన్ని సౌకర్యాలు ఉన్న సౌత్ క్యాంపస్‌ను యూనివర్సిటీగా తీర్చిదిద్దుదామని కామారెడ్డి జిల్లాకు చెందిన శాస్త్రవేత్త, సామాజికవేత్త పైడి ఎల్లారెడ్డి అన్నారు. ఆర్గానిక్ కెమిస్ట్రీ విద్యార్థులకు జపాన్‌లో అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. మండలంలోని టీయూ సౌత్ క్యాంపస్‌లో పైడి ఎల్లారెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఓపెన్ డయాస్ నిర్మాణ పనులకు శుక్రవారం భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పైడి ఎల్లారెడ్డి, టీయూ రిజిస్ట్రార్ యాదగిరి హాజరయ్యారు. ఈ సందర్భంగా పైడి ఎల్లారెడ్డి మాట్లాడుతూ..తాను ఈ ప్రాంతానికి చెందిన వాడినని, వర్సిటీకి సహకారం అందించడం తన బాధ్యత అని పేర్కొన్నారు. దక్షిణ ప్రాంగణంలో అన్ని సౌకర్యాలు ఉన్నా కార్యక్రమాల నిర్వహణ కోసం ఓపెన్ డయాస్ (బహిరంగ వేదిక) లేకపోవడం వెలితిగా అనిపించిందని, అందుకే తాను స్వచ్ఛందంగా నిర్మాణానికి ముందుకు వచ్చినట్లు తెలిపారు.
విదేశీ వర్సిటీలతో సౌత్ క్యాంపస్‌ను అనుసంధానం చేయడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని అన్నారు. సాంకేతికంగా అభివృద్ధి చెందిన జపాన్ సహకారంతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును కల్పిస్తానని భరోసా ఇచ్చారు. ప్రజల ఆకాంక్షమేరకు తాను మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సుధాకర్ గౌడ్, వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వరి, అధ్యాపకులు మోహన్ బాబు, హరిత, ప్రతిజ్ఞ, సబిత, కవితా తోరణ్, నారాయణ, వార్డెన్లు యాలాద్రి, సునీత, ఏపీఆర్వో సరిత, విద్యార్థులు పాల్గొన్నారు.