కంఠేశ్వర్, మే 31: భూసంబంధిత సమస్యలపై రైతులు, ప్రజల దరఖాస్తులు స్వీకరించేందుకు వీలుగా జూన్ 3వ తేదీ నుంచి గ్రామాల వారీగా చేపట్టనున్న రెవెన్యూ సదస్సులను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో శనివారం తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సర్వేయర్లకు రెవెన్యూ సదస్సుల నిర్వహణ, దరఖాస్తుల పరిశీలన, క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా భూభారతి చట్టంలోని నిబంధనలపై దరఖాస్తులను పరిష్కరించాల్సిన తీరును వివరించారు.
ఇప్పటికే పైలెట్ ప్రాతిపదికన జిల్లాలోని మెండోరా మండలంలోని ఎనిమిది గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టామని కలెక్టర్ తెలిపారు. అదే తరహాలో ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సదస్సులను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ నూతన ఆర్వోఆర్‌తో చట్టంలో పొందుపర్చిన నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తుల స్వీకరణ, వాటి పరిశీలన, విచారణ ప్రక్రియలను నిర్వహించాలన్నారు.
జూన్ 20వ తేదీలోగా రెవెన్యూ సదస్సులను విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు. సదస్సుల నిర్వహణకు సంబంధించిన సమాచారాన్ని రెండు రోజుల ముందే ఆ ప్రాంత రైతులు, ప్రజలకు తెలిసేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. రిజిస్టర్లలో సమగ్ర వివరాలను నమోదు చేస్తూ పూర్తి డాటాను కంప్యూటర్ ఆన్‌లైన్‌లోనూ పొందుపర్చాలని ఆదేశించారు. ఒకే దరఖాస్తులో ఒకటి కన్నా ఎక్కువ సంఖ్యలో భూ సమస్యలను పొందుపరిస్తే ప్రతి సమస్యను తప్పనిసరిగా పరిశీలిస్తూ వేర్వేరుగా విచారణ జరుపాలన్నారు. అవగాహన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్, ఆర్డీవోలు రాజేంద్రకుమార్, రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.